
సైజు కాదు.. షేప్ చూడండి: మీకు ఎక్కువ నీళ్లు కావాలనుకుంటే.. మరీ పెద్ద కాయలను కాకుండా మధ్యస్థ సైజులో ఉన్న వాటిని ఎంచుకోండి. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే.. బాగా గుండ్రంగా ఉండే కొబ్బరికాయల్లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా కాస్త పొడవుగా లేదా కోడిగుడ్డు ఆకారంలో కోలగా ఉండే కొబ్బరికాయల్లో నీరు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో కొబ్బరి మీగడ కట్టే ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి గుండ్రని కాయలకే ఓటేయండి.

ఊపి చూడండి: కొబ్బరికాయను చేతిలోకి తీసుకుని మీ చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా ఊపి చూడండి. ఒకవేళ లోపల నుంచి లబలబ అంటూ పెద్దగా చప్పుడు వినిపిస్తే.. అందులో నీళ్లు తక్కువగా, గాలి ఎక్కువగా ఉందని అర్థం. అదే నీళ్లతో నిండుగా ఉన్న కొబ్బరికాయలో లోపల గాలి ఉండటానికి అస్సలు ఖాళీ స్థలం దొరకదు. అందుకే దాన్ని ఊపినప్పుడు అస్సలు శబ్దం రాదు లేదా చాలా తక్కువగా వస్తుంది. ఏ శబ్దమూ రాని కాయే మనకు కావలసిన అసలైన కాయ.

కలర్ పక్కాగా గమనించండి: కొబ్బరికాయ ఎప్పుడూ ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉండాలి. బొండాం పైభాగంలో అక్కడక్కడా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తున్నాయంటే.. అది పాతపడిపోయిందని అర్థం. అలాంటి కాయల్లో నీరు ఆవిరైపోయి లోపల ముదిరిన మీగడలా మారిపోతుంది. కాబట్టి మచ్చలు లేని పచ్చని కాయలనే సెలెక్ట్ చేసుకోండి.

బరువు.. మూడు గుర్తులు: కొబ్బరికాయను చేతితో పట్టుకున్నప్పుడు.. దాని సైజు కంటే అది చేతికి బాగా బరువుగా అనిపించాలి. అలా బరువుగా అనిపిస్తే అందులో నీళ్లు నిండుగా ఉన్నాయని గుర్తు. అలాగే కొబ్బరికాయ పైభాగంలో ఉండే మూడు గుర్తులను ఒకసారి చూడండి. ఆ గుర్తులు మరీ గట్టిగా, ముదురు నలుపు లేదా గోధుమ రంగులోకి మారిపోయి ఉంటే.. అది పాత కాయ అని ఈజీగా కనిపెట్టేయవచ్చు.

ఇకపై ఎప్పుడు రోడ్డు పక్కన కొబ్బరి నీళ్లు తాగాలనిపించినా.. పెద్ద సైజు కాయల వెనుక పరిగెత్తకుండా ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి గుండ్రంగా, బరువుగా ఉండే పచ్చని కాయను ఎంచుకోండి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కొబ్బరి నీళ్లను తాగి ఈ వేసవిలో హాయిగా రీఛార్జ్ అయిపోండి.