
హీరోలతో పోల్చితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాపులు పడితే చాలు హీరోయిన్లకు అవకాశాలు కరవువుతాయి. ఫలితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయిపోతారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇందుకు మినహాయింపు అని చెప్పవచ్చు.

హైదారాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగింది నిధి అగర్వాల్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2017లో మున్నా మైఖెల్ అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

2018లో అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది నిధి. ఈ సినిమా బాగా ఆడడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అక్కినేని అఖిల్ తో నటించిన మిస్టర్ మజ్ను నిరాశపరిచినా ఇస్మార్ట్ శంకర్ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అందం, అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత సుమారు 6 సినిమాల్లో నటించింది నిధి. అందులో పవన్, ప్రభాస్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పటికీ ఈ బ్యూటీ చేతిలో సుమారు అరడజను సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం నిధి అగర్వాల్ ఖాతాలో మూడు హిందీ సినిమాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్’ బ్యానర్లో ఒక తమిళ చిత్రంలో నటిస్తోందీ అందాల తార. అలాగే టాలీవుడ్‌లోనూ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సైన్ చేసింది నిధి. మొత్తానికి వరుస ఫ్లాపులు వచ్చినా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.