
సీనియర్ నటి శారద గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె . తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. మొదట హీరోయిన్ గా నటించిన శారద ఆ తర్వాత క్రమంగా సహాయక నటిగా మారిపోయారు.

కేవలం తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారు శారద. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు.. ఇలా శారద కీర్తి కిరీటంలో ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, ప్రశంసలు ఉన్నాయి.

1955లో వచ్చిన ‘కన్యా శుల్కం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు శారద. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు, బలిపీళం, శారద, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , ఊర్వశి, ఇంద్ర ధనుస్సు, ప్రతిధ్వని, జస్టిస్ చౌదరి, అత్తా కోడళ్లు, సర్దార్ పాపారాయుడు, అమ్మ రాజీనామా, ఏవండి ఆవిడ వచ్చింది, మేజర్ చంద్రకాంత్, అంతఃపురం, స్టాలిన్, యోగి, సుకుమారుడు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో శారద నటించారు.

కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు శారద. చివరిగా 2013లో సుకుమారుడు అనే సినిమాలో కనిపించారామె. ఈ మధ్యన పెద్దగా బయట కనిపించని ఆమె తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ఆమె సరిగ్గా నడవలేని పరిస్థితిలో కనిపించారు.

ఈ ఈవెంట్ లో పక్కనున్న వారి సహాయంతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు శారద. ప్రస్తుతం ఈ సీనియర్ నటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆరోగ్యం పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

శారద వయసు సుమారు 80 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు. కాగా శారద రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు అయినా పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారీ సీనియర్ నటి.