
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. అయితే కేవలం సాధారణ హత్యల ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా.. దానితో పాటు మూఢనమ్మకాలు, చేతబడులు, తంత్ర-మంత్రాలు, పౌరాణిక నేపథ్యాన్ని మిక్స్ చేసి తెరకెక్కించిన సిరీస్‌లు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంటాయి. సరిగ్గా అదే కోవకు చెందిన ఒక గ్రిప్పింగ్ డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో నిలిచింది. అదే ‘మండల మర్డర్స్’.

ప్రముఖ నవలా రచయిత మహేంద్ర జఖర్ రాసిన ప్రసిద్ధ మిస్టరీ నవల ‘ది బుచర్ ఆఫ్ బనారస్’ ఆధారంగా ఈ సిరీస్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించి ఓటీటీ అరంగేట్రం చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘నెట్‌ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘మర్దాని 2’ ఫేమ్ గోపి పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతోంది.

ఈ సిరీస్ కథ ఉత్తర ప్రదేశ్‌లోని ‘చరణ్‌దాస్‌పూర్’ అనే ఒక ఊహాజనిత పట్టణం నేపథ్యంలో సాగుతుంది. 1952వ సంవత్సరంలో ‘ఆయస్తి’ అనే వింత సమూహం.. ‘ఆయస్తి యంత్రం’, శక్తుల సహాయంతో ఒక మరణించిన వ్యక్తిని తిరిగి బతికించడానికి ప్రయత్నిస్తుంది. ఈ భయంకరమైన చేతబడి అనుష్ఠానాన్ని చూసి భయపడిన గ్రామస్థులు, వారి స్థావరాన్ని తగలబెడతారు. కట్ చేస్తే.. వర్తమానంలో ఆ పట్టణంలో వరుసగా విచిత్రమైన హత్యలు ప్రారంభమవుతాయి.

ప్రతి హత్యలోనూ బాధితుల శరీరాల నుంచి ఏదో ఒక కీలకమైన అవయవాన్ని తీసుకుని, వారి మృతదేహాలపై ఒక ప్రత్యేకమైన ‘మండల’ గుర్తును వేస్తుంటారు. ఈ ఘోరమైన కేస్‌ను ఛేదించడానికి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా), డిటెక్టివ్ రియా థామస్ (వాణి కపూర్) రంగంలోకి దిగుతారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడే నిజాలు, వెనుక ఉన్న చేతబడుల రహస్యాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి.

ఇందులో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియ పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా నవలలోని కొన్ని అంశాలను మన భారతీయ తంత్ర-మంత్రాలు, రహస్య ఆచారాల నేపథ్యానికి అనుగుణంగా మేకర్స్ మార్పులు చేయడం సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచింది. ఐఎండీబీ (IMDb) లో మంచి రేటింగ్ దక్కించుకున్న ఈ ‘మండల మర్డర్స్’ థ్రిల్లర్ ప్రేమికులకు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక పర్ఫెక్ట్ వాచ్!