
ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. భయానక, జానపద కథల ఆధారంగా తెరకెక్కించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి మరాఠీ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. ఈ చిత్రం కథ, మహారాష్ట్రకు చెందిన జానపద కథలు, రహస్యం, నిధి , భయంల కలయికను చూపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరేంటీ... కథేంటీ అనే వివరాలు తెలుసుకుందామా.

ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా పేరు 'ఘబడ్‌కుండ్'. దాగి ఉన్న బంగారం, ఒక భయంకరమైన శక్తి గురించిన పురాణ గాథతో ముడిపడి ఉన్న ఒక రహస్యమైన బావి చుట్టూ దీని కథ తిరుగుతుంది. ఈ బావిలో నిధి ఉందని ఆ గ్రామ ప్రజలకు తెలుసు. అయితే, దానిని పొందడానికి ప్రయత్నించే వారికి ఈ ప్రదేశం ప్రాణాంతకంగా మారుతుంది. ఆ నిధిని కాపాడే అదృశ్య శక్తి కారణంగా బావిలోని రహస్యం మరింత క్లిష్టంగా మారుతుంది.

ఈ చిత్రంలో, దిలీప్ ఒక సాధారణ కుటుంబంలో నివసించే యువకుడు. ఒక సంఘటనలో, అతను అనుకోకుండా ఆ రహస్యమైన బావి వద్దకు చేరుకుంటాడు. అక్కడ, అతను ఒక మహిళ గొంతు విని ప్రమాదంలో పడతాడు. కానీ ఆశ్చర్యకరంగా, అతను ఆ బావి నుండి ప్రాణాలతో బయటపడతాడు. ఈ సంఘటన తర్వాత, అతని పుట్టుకకు, ఆ బావి చరిత్రకు మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి రావడం మొదలవుతుంది. అప్పుడే అసలు కథ ఉంటుంది.

దిలీప్ ఈ రహస్య నిధికి వారసుడని వెల్లడైన తర్వాత కథ మరింత మలుపులు తిరుగుతుంది. మరోవైపు, ఖాంగ్రీ అనే తాంత్రికుడు కూడా ఈ నిధిపై కన్నేసి ఉంటాడు. పౌర్ణమి రోజున, బావిలోంచి నిధిని బయటకు తీయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే, ఈ పని కోసం ఒక అమ్మాయిని ఉపయోగించుకోవడానికి కుట్ర పన్నుతారు, ఆ తర్వాత సంఘటనలు భయంకరమైన మలుపు తీసుకుంటాయి. ఆద్యంతం సినిమా ఉత్కంఠగా సాగుతూ ఆకట్టుకుంటుంది.

ప్రీతమ్ ఎస్. కె పాటిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుశాల్ బద్రికే, సందీప్ పాఠక్, దేవ్దత్ నాగే, శశాంక్ షెండే , స్మిత పైగుడే నటించారు. ఈ చిత్రం 19 జూన్ 2026న విడుదలైంది. IMDbలో పదికి 7.5 రేటింగ్‌ను పొందింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ చిత్రంలో ఊహించని మలుపులు, ట్విస్టులు ఉండడంతో సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది.