
భారతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రాంతీయ భాషా చిత్రాలకు, ముఖ్యంగా సస్పెన్స్ , మిస్టరీ థ్రిల్లర్ జోనర్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే కన్నడ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఒక భయానక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అదే 'అయ్యన మనే 2'.

ఈ సిరీస్ మొదటి భాగం సృష్టించిన సంచలనం తెలిసిందే. కాగా ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వచ్చిన 'అయ్యన మనే సీజన్ 2' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ముగిసిన ఉత్కంఠభరితమైన మలుపుల నుంచి రెండో సీజన్ కథ ప్రారంభమవుతుంది. ఒక పాత ఇల్లు, ఆ ఇంటికి సంబంధించిన భయానక రహస్యాలు, కోడళ్ల వరుస మరణాలు వంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

"ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది?" అనే ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో వచ్చే సీన్లు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఒకే ఇంటి నేపథ్యం, అవే ప్రధాన పాత్రలు అయినప్పటికీ కథనంలో దర్శకుడు రమేష్ ఇందిరా చూపించిన టేకింగ్, ఊహించని ట్విస్టులు సిరీస్‌పై ఆసక్తిని విపరీతంగా పెంచేస్తాయి. ప్రముఖ నిర్మాత శ్రుతి నాయుడు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో రూపేష్ శెట్టి, టాలెంటెడ్ తెలుగు నటి ఖుషి రవి, అక్షయ్ నాయక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

మొదటి సీజన్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా, రెండో సీజన్‌ను మరింత క్వాలిటీతో, సాంకేతిక విలువలతో రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. మొత్తం 6 ఎపిసోడ్లుగా సాగే ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ ప్రియులను కట్టపడేయడం ఖాయం. ఈ ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి పలు ప్రధాన భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. వారాంతంలో కుటుంబంతో కలిసి చూడటానికి అనువైన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్న ప్రేక్షకులకు ఈ సిరీస్ చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. దర్శకుడు రమేష్ ఇందిరా ఈ సస్పెన్స్ డ్రామాను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సిరీస్ బాగా ఆకట్టుకుంటోంది.