
మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఆర్కా మీడియా వర్క్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి

అడ్వెంచర్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 02)న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో సారా పాలేకర్ అనే ఛైల్డ్ ఆర్టిస్ట్ ఓ కీలక పాత్ర చేసింది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, ట్రైలర్ కంటెంట్ లో ఫహాద్ ఫాజిల్ తో పాటు ఈ పాపనే ఎక్కువగా కనిపించింది. ఈ మూవీ మొత్తం దాదాపు వీరిద్దరి చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 29) జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ సారా నే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ చిన్నారి ఎవరో, తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్యూటీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2017లో పుట్టిన సారా పాలేకర్.. నాలుగేళ్లకే అంటే 2021లో నటించడం మొదలుపెట్టింది. మరాఠీలో కొన్ని సీరియల్స్, టీవీ షోల్లో చేసింది సారా. అలాగే కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది. ఇక ప్రస్తుతం సినిమాల్లో బాలనటిగా రాణిస్తోంది సారా. గతంలో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలోనూ సారా పాలేకర్ వెంకీ కూతురిగా నటించింది.

ఇప్పుడు మళ్లీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యిందీ క్యూటీ. సినిమాలో ఫహాద్ ఫాజిల్ తర్వాత సారా పాలేకర్ యాక్టింగే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుందని సినిమా నిపుణులు చెబుతున్నారు. ఈ శుక్రవారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.