
సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు బాలనటులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా ఎదుగుతుంటారు. తమ నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అందరికీ కెరీర్ ఒకేలా సాగదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన కొందరు తారలు కాలక్రమేణా అవకాశాలు తగ్గడంతో ఇతర రంగాల వైపు అడుగులు వేస్తుంటారు. అలాంటి వారిలో నటి తేజస్వి మదివాడ కూడా ఒకరు. తేజస్వి మదివాడ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె చలాకీతనం, బోల్డ్ నటన.

సినిమాల్లో తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల కంటే టెలివిజన్ కార్యక్రమాలు, టాక్ షోలతో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, కెరీర్, అభిప్రాయాల గురించి ఆమె చేసే వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. అయితే తెరపై ఎంతో ఉత్సాహంగా కనిపించే తేజస్వి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కష్టాలను ఎదుర్కొన్నట్లు ఆమె గతంలో పలు సందర్భాల్లో వెల్లడించింది.

తండ్రి మద్యానికి బానిస కావడంతో ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, అనాథాశ్రమంలో ఉంటూ తన జీవితాన్ని కొనసాగించానని చెప్పుకొచ్చింది. చదువును కొనసాగించేందుకు కూడా ఎన్నో ఇబ్బందులు పడినట్లు తేజస్వి తెలిపింది. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేక రెండేళ్ల పాటు మధ్యాహ్న భోజన సమయంలో పానీపూరి తింటూ ఆకలి తీర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కష్టాలను ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నించింది.జర్నలిజంలో విద్యను అభ్యసించిన తేజస్వికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

మహేశ్ బాబు, వెంకటేశ్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలతో నటిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఐస్ క్రీమ్' సినిమాలో కథానాయికగా నటించి మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో తన గ్లామర్, బోల్డ్ పెర్ఫార్మెన్స్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ తేజస్వికి ఆశించిన స్థాయిలో వరుసగా ప్రధాన పాత్రలు దక్కలేదు. ఎక్కువగా సెకండ్ లీడ్, సహాయ పాత్రల్లోనే కనిపించాల్సి వచ్చింది.

అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. మరోవైపు బుల్లితెరపై కూడా తేజస్వి తన సత్తా చాటింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని తన ఆటతీరుతో ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. హౌస్‌లో ఆమె ప్రవర్తన, మాటతీరు, ఇతర కంటెస్టెంట్లతో జరిగిన సంఘటనలు అప్పట్లో సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా నిలిచాయి. సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తేజస్వి ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫోటోషూట్లు, వీడియోలు, ఇంటర్వ్యూలతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది.