
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అందం, అభినయంతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో చేసింది రెండే సినిమాలు అయినప్పటికీ.. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాలో భాగమైంది.

బీటెక్ చదువును మధ్యలోనే వదిలేసి, చేతిలో కేవలం రూ.500తో ముంబైకి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు కోట్ల రూపాయల సంపాదనతో వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన దిశా పటాని మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అందం, ఫిట్‌నెస్‌తో మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది.

లోఫర్ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లిన దిశా.. 2016లో విడుదలైన ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రియాంక ఝా పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బాఘీ 2, భారత్, మలంగ్, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో దిశా నటించిన మరో కీలక చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాక్సీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో దిశా కెరీర్‌లోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2024లో సూర్య హీరోగా వచ్చిన తమిళ చిత్రం కంగువలోనూ నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 2026లో ఓ రోమియో, వెల్కమ్ టు ది జంగిల్, ఆవారాపన్ 2 వంటి సినిమాలతో దిశా తన కెరీర్‌లో మరింత బిజీగా మారింది. ముఖ్యంగా ఆవారాపన్ 2లో ఎమ్రాన్ హష్మీ సరసన నటించడం విశేషం.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ దిశాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫ్యాషన్, ఫిట్‌నెస్, గ్లామర్ ఫోటోలు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక దిశా సంపాదన విషయానికి వస్తే.. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆమె ఆస్తి విలువ సుమారు రూ.75 కోట్లుగా అంచనా. ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెడుతుంది.