
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వెండితెరపై కనిపించే నటీమణుల రూపం, శరీరాకృతిపై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు కాస్త బరువు పెరిగినా, బరువు తగ్గినా నెటిజన్లు ట్రోలింగ్ చేయడం కామన్‌గా మారిపోయింది. ఇలాంటి విమర్శలను కొందరు లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం వాటి కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ఓ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఆమె మరెవరో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరాఠీ నటి శ్రుతి మరాఠే. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. దేవర సినిమా విడుదలైన తర్వాత శ్రుతి మరాఠే గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికారు. దీంతో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే శ్రుతి మరాఠే గతంలో తన శరీరాకృతిపై ఎదురైన విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా తన బరువును టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల పాటు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడంతో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యానని తెలిపింది. ఆ మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపించాయని, చివరకు తనలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.

ఒకప్పుడు తాను కాస్త బరువుగా ఉన్నప్పుడు 'నువ్వు చాలా లావుగా ఉన్నావు' అంటూ విమర్శించేవారని శ్రుతి తెలిపింది. ఆ కామెంట్స్ తనను ఎంతో బాధించాయని, మానసిక ఒత్తిడికి గురిచేశాయని చెప్పింది. అయితే ఇప్పుడు బరువు తగ్గిన తర్వాత కూడా 'నువ్వు చాలా సన్నగా అయిపోయావు' అంటూ కామెంట్స్ చేస్తున్నారని పేర్కొంది. ఈ మాటలు వింటుంటే తనకు నవ్వొస్తుందని తెలిపింది. గత 15 నుంచి 20 ఏళ్లుగా తన శరీరాకృతిపై ఇలాంటి వ్యాఖ్యలే వింటున్నానని శ్రుతి చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి శారీరకంగా ఎలా ఉన్నారనే విషయాన్ని మాత్రమే చూసి విమర్శించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడింది.

వారి ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉందనే విషయాలను కూడా అర్థం చేసుకోవాలని సూచించింది. ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ ఒకరి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఇలాంటి విమర్శలను తాను ఏమాత్రం పట్టించుకోవడం లేదని శ్రుతి స్పష్టం చేసింది. ఒకప్పుడు తనను ఎంతో బాధపెట్టిన కామెంట్స్‌ను ఇప్పుడు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నానని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో బాడీ షేమింగ్‌పై నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.