
నటి అవికా గోర్ రీసెంట్ గా అగ్లీ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది అవికా. తన ఏడేళ్ల ప్రేమ వివాహం, పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి తెలిపింది అవికా. బాలికా వధు వంటి సీరియల్ తో చిన్నతనంలోనే ఆమె కెరీర్ ప్రారంభమైంది. ముంబైలో పెరిగిన అవికాకు రాజస్థానీ భాషపై అవగాహన లేకపోయినా, బాలికా వధులో రాజస్థానీ పాత్రకు ఎంపికైంది. ఈ సీరియల్ విజయం ఆమెకు విశేష గుర్తింపు తెచ్చింది.

ఆ తర్వాత 15 ఏళ్ల వయస్సులో ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తాను సినిమాల్లోకి రావాలని, ప్రత్యేకించి తెలుగు చిత్రాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇదంతా అనూహ్యంగా జరిగిందని అవికా తెలిపింది. తన కెరీర్ వేగంగా సాగిందని, బాలికా వధు, ఉయ్యాల జంపాల వంటి డ్రీమ్ రోల్స్ చిన్నతనంలోనే దక్కాయని అవికా చెప్పుకొచ్చింది. తనది ప్రేమ వివాహమని, ఏడేళ్ల నుంచి తమకు ఒకరి గురించి మరొకరికి తెలుసని తెలిపింది. తన తల్లి ఆరు నెలల్లోనే తన భర్తను ఒప్పుకున్నారని అవికా గోర్ పేర్కొంది.

పెళ్లి తర్వాత తమ దాంపత్య జీవితం చాలా సంతృప్తికరంగా ఉందని, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతు ఇస్తూ తమ సంబంధాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. సామాజిక మాధ్యమాల ప్రభావం తమ సంబంధంపై ఉండదని, తాము వాటికి అతీతంగా ఆలోచిస్తామని అవికా తెలిపింది. తామిద్దరూ ఒకరికొకరు చాలా సపోర్ట్ గా ఉంటామని , తమ తల్లిదండ్రుల బంధాన్ని ఆదర్శంగా తీసుకుంటామని అవికా చెప్పుకొచ్చింది. తన భర్త కార్పొరేట్ రంగంలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అని అవికా తెలిపింది.

ఆయన బెంగళూరులో పనిచేసి ప్రస్తుతం బ్యాంకాక్‌లో స్థిరపడ్డారని. అవికా కూడా బ్యాంకాక్‌లోనే నివసిస్తున్నప్పటికీ, సినిమాల కోసం ఇండియాకు వస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది. తమ కెరీర్లు వేర్వేరు అయినప్పటికీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతు ఇస్తూ తమ జీవితాన్ని సమతుల్యం చేసుకున్నట్లు తెలిపింది. తన భర్త తన వృత్తిని మాత్రమే కాకుండా, వ్యక్తిగా తనను అర్థం చేసుకుంటారని, తన పని వల్ల కాకుండా తన వ్యక్తిత్వం వల్ల తనను ప్రేమిస్తారని అవికా తెలిపింది.

తన కెరీర్ ప్రయాణాన్ని తాను ఎప్పుడూ అంచనా వేయలేకపోయానని అవికా పేర్కొంది. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో తనకు తెలియదని తెలిపింది అవికా. అలాగే భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించడం వంటి అనూహ్య విషయాలపై కూడా ఆమె సానుకూలంగా స్పందించింది.. స్మృతి ఇరానీ వంటి వారు పార్లమెంట్‌లో నిలబడినట్లుగా, తాను కూడా అలాంటిది ఏదైనా చేయడానికి వెనుకాడనని, ఎందుకంటే తనకు ఏది ఆశ్చర్యం కలిగించదని ఆమె అన్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో తన కెరీర్‌లో అంచనా వేయలేనని, కాబట్టి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశానని అవికా చెప్పుకోచ్చింది.