
స్టార్ కిడ్స్ గా పుట్టినంత మాత్రాన కెరీర్‌లో అన్నీ సులభంగానే దొరికిపోతాయని అనుకోవడం సహజం. అయితే ప్రతి స్టార్ కిడ్ ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరు తల్లిదండ్రుల బాటలో నడిస్తే.. మరికొందరు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ ఒకరు. కమల్ హాసన్, నటి సారికల కుమార్తెగా, నటి శ్రుతి హాసన్ చెల్లెలిగా అక్షర హాసన్‌కు చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీకి పరిచయం ఉంది.

అయినప్పటికీ తాను మొదటి నుంచే నటిగా మారాలని నిర్ణయించుకోలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల సైరస్ బ్రూచా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అక్షర.. తన చదువు, కెరీర్, తల్లిదండ్రుల ప్రోత్సాహం, భవిష్యత్తు లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా కుటుంబంలో పుట్టినా అక్షర హాసన్ కెరీర్‌ను హీరోయిన్‌గా ప్రారంభించలేదు. ముందుగా డ్యాన్స్‌పై ఆసక్తితో కొరియోగ్రఫీ వైపు అడుగులు వేసింది. తన స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు డ్యాన్స్ కంపోజ్ చేసినట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత సినిమా దర్శకత్వంపై ఆసక్తి పెరగడంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.

నటన విషయంలోనూ మొదట్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా.. ఒకసారి ప్రయత్నించి చూడాలనే ఆలోచనతో సినిమాల్లోకి వచ్చినట్లు అక్షర పేర్కొంది. అయితే భవిష్యత్తులో తన అసలు లక్ష్యం మాత్రం దర్శకత్వమేనని స్పష్టం చేసింది. ఎప్పటికైనా మెగాఫోన్ పట్టి సినిమా తెరకెక్కించాలనే కోరిక తనకు ఉందని తెలిపింది అక్షర. అలాగే అక్షర హాసన్ విద్యాభ్యాసానికి సంబంధించిన విషయం కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికరంగా మారింది. 10వ తరగతి పరీక్షల్లో తాను వరుసగా మూడుసార్లు ఫెయిల్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో చదువుపై ఆసక్తి క్రమంగా తగ్గిపోయిందని, చివరికి ఇక చదువును కొనసాగించడం తన వల్ల కాదని భావించి స్టడీస్ ను మధ్యలోనే ఆపేసినట్లు తెలిపింది.

కమల్ హాసన్, సారిక వంటి ప్రముఖ నటుల కుమార్తె కావడంతో తమపై సినిమాల్లోకి రావాలనే ఒత్తిడి ఉండేదా.? అనే ప్రశ్నకు అక్షర ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తల్లిదండ్రులు తమను ఎప్పుడూ నటులుగా మారాలని బలవంతం చేయలేదని ఆమె చెప్పారు. నటనపై ఆసక్తి లేకపోతే తమకు నచ్చిన మరో రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపింది. తమ తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్వేచ్ఛే తమపై ఉన్న ఒత్తిడిని తగ్గించిందని అక్షర చెప్పుకొచ్చింది. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో తమకు నచ్చిన విధంగా ముందుకు వెళ్లాలని వారు ప్రోత్సహించారని చెప్పింది అక్షర.

తమ కుటుంబంలో సినిమాలపై చర్చలు చాలా ఓపెన్‌గా జరుగుతాయని అక్షర తెలిపింది. తాము చేసిన పని నచ్చకపోతే కుటుంబ సభ్యులు మొహమాటం లేకుండా చెప్పేస్తారని, నటనలో తప్పులు చేసినప్పుడు కూడా బయటివాళ్లు చెప్పే ప్రశంసల కంటే ఇంట్లో వచ్చే నిజాయితీతో కూడిన విమర్శలే తమకు ఎక్కువగా ఉపయోగపడతాయని ఆమె చెప్పుకొచ్చింది. తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లే అవకాశం కుటుంబం నుంచి లభించిందని వివరించారు.