
టాలీవుడ్లో ఎప్పట్నుంచో ఒక విమర్శ వినిపిస్తుంటుంది. ముంబై, ఢిల్లీ నుంచి హీరోయిన్లను తీసుకొస్తారు కానీ మన తెలుగు అమ్మాయిలకు మాత్రం పెద్దగా అవకాశాలు ఇవ్వరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఈ ట్రెండ్‌ను పూర్తిగా మారుస్తూ ఇప్పుడు టాలీవుడ్లో ఒక తెలుగమ్మాయి పేరు తీవ్రంగా మార్మోగుతోంది. తను నటించిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటూ సంచలనం సృష్టిస్తోంది ఆ టాలెంటెడ్ బ్యూటీ సాత్విక వీరవల్లి (Satvika Veeravalli).

ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ యంగ్ నటి గురించే హాట్ చర్చ జరుగుతోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆకాశంలో ఒక తార'. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తూ సాత్విక వీరవల్లి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. చిత్ర యూనిట్ ఆమె డెబ్యూ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో సాత్విక పేరు వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా విడుదలైన 'ఆకాశంలో ఒక తార' ట్రైలర్‌ను గమనిస్తే.. తాను తొలిసారి నటిస్తున్నప్పటికీ ఎంతో పరిణతితో కూడిన అభినయాన్ని ప్రదర్శించిందనే ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్లో ఒక స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏ నటనైనా, ఏ హీరోయిన్ అయినా తన మొదటి సినిమా థియేటర్లలో విడుదలై, దానికి వచ్చే రిజల్ట్ బట్టి తదుపరి అవకాశాలను అందుకుంటారు.

కానీ సాత్విక వీరవల్లి విషయంలో మాత్రం సీన్ పూర్తిగా భిన్నంగా ఉంది. 'ఆకాశంలో ఒక తార' సినిమా రిలీజ్ కాకముందే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో మరో పెద్ద ప్రాజెక్ట్‌ను పట్టేసింది. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఓ కొత్త సినిమాలో సాత్వికనే హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా స్పష్టం చేశారు. తొలి సినిమా థియేటర్లకు రాకముందే మరో స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేయడం టాలీవుడ్ చరిత్రలో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌లోనూ సాత్విక పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం విశేషం.

అసలు ఈ సాత్విక వీరవల్లి నేపథ్యం ఏంటి, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటని తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో జన్మించిన సాత్విక మంచి డ్యాన్సర్. ఆమె తల్లి వనిత భరతనాట్యం టీచర్ కావడంతో, చిన్నతనం నుంచే తల్లి వద్దే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఇక చదువు విషయానికి వస్తే, సాత్విక అమెరికాలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంతేకాకుండా ప్రముఖ ఐటీ కంపెనీలైన ఒరాకిల్ సెర్నర్ వంటి సంస్థల్లో దాదాపు నాలుగేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ సమయంలో నెలకు లక్షల్లో జీతం అందుకున్నప్పటికీ, నటనపై ఉన్న మక్కువతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ సాత్విక ఇండియాకు వచ్చేశారు.