
ప్రముఖ నటి రంభ గతంలో ఓ కార్యక్రమంలో తన జీవితం, సినీ ప్రస్థానం, వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రంభ అంటే అందానికి నిర్వచనం అంటారు. మరి మీలో అత్యంత అందమైన గుణం ఏమిటి.? అని అడిగినప్పుడు, "నా నవ్వే నా అందం" అని ఆమె బదులిచ్చారు. తనకు ఎంత బాధ వచ్చినా దాచుకోనని, కన్నీళ్లు ఆగకుండా వస్తాయని, తాను భావోద్వేగాలను ముఖంపై దాచుకోలేనని రంభ వివరించారు.

నవ్వినా, ఏడ్చినా అది ఐదు నిమిషాల్లోనే అయిపోతుందని, ఎవరైనా తనను చూసి "ఈ అమ్మాయికి బాధలు, చీకూ చింతలు ఉండవు కాబట్టి ఇలా ఉంది" అని అంటుంటారని ఆమె తెలిపారు. "లైఫ్ ఈజ్ షార్ట్" అనే మాటను తాను నమ్మనని, "లైఫ్ ఈజ్ లాంగ్, గాడ్ గేవ్ అజ్ ఏ లాంగ్ లైఫ్ బట్ వీ ఆర్ ద పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఇట్ షార్ట్" అని రంభ చెప్పారు. ఇతరుల గురించి ఆలోచించి, ఇతరులు ఏమనుకుంటారోనని బాధపడుతూ, మన జీవితాన్ని మనమే చిన్నది చేసుకుంటున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నంతవరకు సంతోషంగా జీవించాలనేదే తన జీవిత సిద్ధాంతమని ఆమె అన్నారు.

సినిమా రంగంలో ఎదురైన విమర్శలను కూడా రంభ సానుకూలంగా స్వీకరించారట. "మీ పర్ఫార్మెన్స్ బాలేదు" అని ఎవరైనా చెప్తే, అక్కడే దాని గురించి ఆలోచించి, ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో లేదా సోదరీమణులతో పంచుకునేదానినని అన్నారు. వారు తనను ప్రోత్సహించి, బాగానే ఉంది అని చెప్పే వారని ఆమె గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తనను తిడితే మాత్రం నెల రోజులు మాట్లాడనంత మొండితనంతో ఉండేదానినని, తప్పు తనది కానప్పుడు వారిని టార్చర్ పెడతానని నవ్వుతూ చెప్పారు.

తన తండ్రితో ఆరు నెలల పాటు మాట్లాడకుండా ఉన్న సంఘటనను కూడా ఆమె పంచుకున్నారు. చిన్నతనంలో తాను మొండి అమ్మాయిని అని, కొన్ని విషయాల్లో మొండితనం తన నైజమని ఆమె తెలిపారు. రంభ కుటుంబం స్వీట్ బిజినెస్ చేసేదని, అందుకే తాను స్వీట్స్ ఎక్కువగా తినేదానినని అన్నారు. మంచిగా తినే అమ్మాయిని కావడంతో, సినిమా రంగంలో డైట్ చేయమని చెప్పినా, మళ్లీ తినేదాన్నని చెప్పారు. "జీరో ఫిగర్స్" కంటే "హ్యాపీ ఫిగర్స్" ఉండటమే తనకు ఇష్టమని, రౌండ్ ఫిగర్ అనేది ఇండియన్ గర్ల్స్ ట్రేడ్‌మార్క్ అని ఆమె పేర్కొన్నారు.

పరిశ్రమలో పోటీ గురించి మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరూ గుర్రం లాగా, ఏనుగు లాగా, ఎలుక లాగా ఉంటారు. ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది" అని ఆమె అన్నారు. ఒక హీరోయిన్‌కు ఉండే ప్రాధాన్యత మరొకరికి ఉండదని, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమేనని రంభ అభిప్రాయపడ్డారు. తన కాలంలో దర్శకులు తమకు తగిన పాత్రలను సృష్టించేవారని, శ్రీదేవి గారి లాంటి వారికి ప్రత్యేకంగా పాత్రలు రాసేవారని ఆమె తెలిపారు. తాను సరైన సమయంలో సినీ రంగ ప్రవేశం చేశానని, హిట్లర్ సినిమాలో తనకు సాధారణ గ్లామరస్ రోల్ ఉన్నప్పటికీ, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకులు తన నటనలో విజిల్ వేయడం వంటి ఇంప్రొవైజేషన్లు చేయించారని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను సరైన సమయానికి వచ్చి, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నందుకు అదృష్టవంతురాలిని" అని రంభ గర్వంగా తెలిపారు.