
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తెచ్చుకుంది కత్రినా కైఫ్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు ఫ్యాషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ అమ్మడు విలాసవంతమైన జీవితం గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. అయితే కత్రినా తల్లి సుజానే కైఫ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన జీవితాన్ని ఎంచుకున్నారు. కూతురు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్‌గా ఎదిగిన సమయంలో కూడా సుజానే గ్లామర్ ప్రపంచానికి దూరంగానే ఉన్నారు.

లండన్‌లోని జీవితాన్ని వదిలి సౌత్ ఇండియాకు వచ్చి.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లల విద్య, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. సాధారణ జీవితం గడుపుతూ ఎంతోమంది పిల్లలకు అండగా నిలుస్తున్నారు. సుజానే 2008లో లండన్‌ను విడిచిపెట్టి తమిళనాడులోని గ్రామీణ ప్రాంతానికి వచ్చారు. అక్కడి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో రిలీఫ్ ప్రాజెక్ట్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యతో పాటు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను చేపట్టారు.

మధురై పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు క్రమంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించడం, వారికి అవసరమైన సహాయం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సాయంత్రం వేళ ఉచితంగా ట్యూషన్లు చెప్పడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు సమాచారం. చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయత్నం తర్వాత విద్యతో పాటు ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలను కలుపుకుని విస్తృత కార్యక్రమంగా మారింది.

2015లో సుజానే మౌంటైన్ వ్యూ స్కూల్ ను ప్రారంభించారు. మొదట కేవలం 3 నుంచి 5 సంవత్సరాల వయసున్న సుమారు 30 మంది చిన్నారులతో నర్సరీ స్థాయిలో ప్రారంభమైన ఈ స్కూల్.. క్రమంగా అభివృద్ధి చెంది వందలాది మంది విద్యార్థులకు విద్య అందించే స్థాయికి చేరుకుంది. కత్రినా కైఫ్ ముంబైలో సినిమాలు, వ్యాపార కార్యక్రమాలతో బిజీగా ఉంటే.. ఆమె తల్లి మాత్రం గ్రామీణ వాతావరణంలో పిల్లల మధ్యే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

కరెంటు, ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండవని కత్రినా గతంలో తన తల్లి జీవితం గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇద్దరూ వీడియో కాల్స్ ద్వారా కాకుండా చాలా సందర్భాల్లో సాధారణ ఫోన్ కాల్స్ ద్వారానే మాట్లాడుకోవాల్సి వస్తుందని ఆమె గతంలో తెలిపారు. తల్లి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తూ వస్తున్నట్లు సమాచారం. కూతురు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్‌గా ఎదిగినా.. తల్లి మాత్రం గ్రామీణ పిల్లలతో కలిసి సాధారణ జీవితాన్ని కొనసాగించడం సుజానే ప్రత్యేకతగా నిలిచింది.