
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఆమని. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తున్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ప్రస్తుతం హీరోల గురించి మాట్లాడారు.

ఆమని తన జీవితాన్ని ఒక పోరాటంగా భావిస్తానని అన్నారు. వివాహానికి ముందు కుటుంబ బాధ్యతలను మోశానని, ఇప్పుడు తన పిల్లల కోసం తల్లిగా, తండ్రిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నానని అన్నారు. తన ఎదుగుదలలో తన తల్లి పాత్ర ఎంతో ఉందని, సినిమా పరిశ్రమను ఎప్పుడూ వదలవద్దని ఆమె తల్లి ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారని తెలిపారు. ఇప్పటికీ షూటింగ్‌కు వెళ్తుంటే ఆమె తల్లి ఎంతో సంతోషిస్తారని, టీవీలో ఆమె సినిమాలను ఇష్టంగా చూస్తారని గుర్తు చేసుకున్నారు.

ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడం, మతం మారడంపై వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ, తనకు మతం కంటే మానవత్వం ముఖ్యమని పేర్కొన్నారు. వివాహం తర్వాత కూడా ఆమె తన హిందూ సంప్రదాయాలను, పూజలను కొనసాగిస్తున్నారని, తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. స్వేచ్ఛ , ఎథిక్స్ అనేవి తన జీవితంలో చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.

నటి ఆమని అదే ఇంటర్వ్యూలో ఇప్పుడు ఉన్న హీరోలలో తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆమని గారు వెల్లడించారు. ఆయనలోని ఎనర్జీ, అద్భుతమైన డాన్స్ , మాస్ సినిమాల్లో ఆయన నటన తనను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్‌ను తాను చాలా ఆసక్తిగా చూశానని, ఆయన మాట్లాడే తీరు చాలా బాగుంటుందని ప్రశంసించారు

ఇప్పటికే మహేష్ బాబుతో ఒక సినిమా చేశానని, భవిష్యత్తులో రామచరణ్ , ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆమె తెలిపారు. ఇంటిలో ఏ వస్తువు లేకపోయినా, అది తనకు కావాలని, తన ఇల్లు ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉండాలని ఆమె ఆశిస్తారని తెలిపారు. ఇతరుల ఇళ్ళు చూసినప్పుడు, తాము కూడా ఎందుకు అలా ఉండకూడదని ఆలోచిస్తానని, దాన్ని సాధించడానికి కృషి చేస్తానని ఆమని వివరించారు.