
సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల భామ.. ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోకముందు నుంచే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అతడిపై ఉన్న అభిమానాన్ని తన స్నేహితులతో కూడా పంచుకునేవారని తెలిపారు. సుశాంత్‌ను ప్రత్యక్షంగా చూడాలని, అతడితో కలిసి ఓ ఫొటో దిగాలని అప్పట్లో ఎంతో ఆశపడినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ సుశాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడిపై ఉన్న క్రష్ అలాగే ఉందని పేర్కొన్నారు.

ఓసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఐశ్వర్యకు లభించిందట. అతడిని చూసి ఎంతో సంతోషించిన ఆమె.. ఎలాగైనా ఓ ఫొటో తీసుకోవాలని అనుకున్నారట. ఫిల్మ్ ఫెస్టివల్ అనంతరం జరిగే నైట్ పార్టీకి సుశాంత్ వస్తారని భావించి ఎదురుచూశారు. అయితే ఆయన ఆ పార్టీకి రాకపోవడంతో నిరాశ చెందారట.

ఆ తర్వాత రోజు సుశాంత్ హోటల్ నుంచి వెళ్లిపోయారని తెలిసిందని ఐశ్వర్య తెలిపారు. అంతేకాకుండా, తాను బస చేసిన గదికి పక్క గదిలోనే సుశాంత్ ఉన్నారని తర్వాత తెలుసుకున్నట్లు చెప్పారు. ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ ఆయనను కలవలేకపోయాననే బాధ తనకు మిగిలిపోయిందని గుర్తుచేసుకున్నారు. తన అభిమాన నటుడితో కనీసం ఓ ఫొటో కూడా దిగలేకపోయాననే విషయం అప్పట్లో తనను నిరాశకు గురిచేసిందని వెల్లడించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అద్భుతమైన నటుడని, చాలా చిన్న వయసులోనే ఆయన మరణించడం బాధాకరమని ఐశ్వర్య రాజేశ్ పేర్కొన్నారు. ఆయన నటన, వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు. సుశాంత్‌పై తనకున్న అభిమానం ఇప్పటికీ తగ్గలేదని, ఆయన అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని వెల్లడించారు. దీంతో ఐశ్వర్య రాజేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.