
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యే వారికి ఆహారంలో ప్రోటీన్ చాలా కీలకం. అందుకే బరువు తగ్గాలనుకునే వారు చికెన్, గుడ్లను తమ డైట్‌లో ఎక్కువగా చేర్చుకుంటారు. అయితే ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది అత్యుత్తమమైన ఎంపిక అనే విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంటుంది.

చికెన్ లీన్ ప్రోటీన్‌కు రాజు లాంటిది. ఇందులో కొవ్వులు తక్కువగా ఉండి, కండరాల నిర్మాణానికి అవసరమైన అత్యధిక ప్రోటీన్ లభిస్తుంది. శరీరంలో కండరాల శాతం పెరిగినప్పుడు జీవక్రియ వేగవంతమై కేలరీలు త్వరగా కరుగుతాయి. అంతేకాకుండా ఇందులోని నియాసిన్, విటమిన్ B6, సెలీనియం వంటి పోషకాలు మెదడు చురుకుదనానికి, థైరాయిడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

చికెన్‌తో పోలిస్తే గుడ్లలో ప్రోటీన్ పరిమాణం కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ.. పోషకాల పరంగా గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా చెప్పవచ్చు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం.. ఉదయం అల్పాహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సేపు ఉంటుంది. ఇది పదే పదే ఆహారం తినాలనే కోరికను తగ్గించి, కేలరీల నియంత్రణ ద్వారా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

గుడ్డు పచ్చసొనలో విటమిన్ A, D, E, K లతో పాటు శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే కోలిన్, కంటి చూపును మెరుగుపరిచే లుటిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల తక్కువ ఖర్చుతో తక్కువ కేలరీలలో శరీరానికి కావలసిన సంపూర్ణ పోషకాలను అందించడంలో గుడ్డు నెంబర్ వన్ ఛాయిస్.

ముగింపుగా చూస్తే.. ఈ రెండూ బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మీ లక్ష్యం లీన్ బాడీ, కండరాల అభివృద్ధి అయితే చికెన్‌ను ఎక్కువగా ఎంచుకోవచ్చు. అలా కాకుండా పోషకాలతో కూడిన అల్పాహారం, మెదడు చురుకుదనం ముఖ్యం అనుకుంటే గుడ్లు బెస్ట్ ఆప్షన్. బరువు వేగంగా తగ్గడానికి ఉదయం గుడ్లను, మధ్యాహ్నం లేదా రాత్రి తక్కువ నూనెతో వండిన చికెన్‌ను సమతుల్యంగా తీసుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం.