
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులు మీరు వాడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే. డిసెంబర్ 1వ తేదీ నుంచి రూల్స్ అన్నీ మారనున్నాయి. మరో 15 రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో కొత్త నిబంధనల గురించి క్రెడిట్ కార్డుదారులు తెలుసుకోవాలి. ముందే తెలుసుకోవడం వల్ల దానికి అనుగుణంగా లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు. మార్పుల గురించి తెలియకపోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యూయెల్, ట్రావెల్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్లపై అదనంగా ఛార్జీలు విధించాలని ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది

అన్ని కేటగిరీల కార్డులకు సవరించిన ఛార్జీలు వర్తించనున్నాయి. రూ.30 వేలు దాటిన రవాణా ఛార్జీలపై ఒక శాతం సర్ ఛార్జీ విధించనుంది. టోల్ ఛార్జీలు, ట్రావెల్ ఛార్జీలు వంటివి ఇందులో ఉంటాయి. అంటే ఇక నుంచి మీరు ట్రావెల్ ఛార్జీల కోసం క్రెడిట్ కార్డు నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తే అదనంగా రూ.350 ఛార్జీలు కట్టా్ల్సి ఉంటుంది. ఇక దీనితో పాటు జీఎస్టీ, ఇతర పన్నులు కూడా ఉంటాయి.

లావాదేవీ విలువ రూ.30 వేల కంటే తక్కువ ఉంటే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. బిల్లింగ్ సైకిల్లో మొత్తం చేసిన ఖర్చును కాకుండా ప్రతీ లావాదేవీ ప్రకారం ఈ లెక్కింపు జరుగుతుంది. ఇక పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన కొనుగోళ్ల కోసం క్రెడిట్ కార్డు వాడేవారికి కూడా అదనపు ఛార్జీలు పడనున్నాయి. ఒక బిల్లింగ్ సైకిల్(స్టేట్మెంట్) ఆధారంగా ప్యూయల్ ఖర్చులపై సర్ ఛార్జీ అనేది ఉంటుంది. దీని పరిమితి రూ.50 వేలుగా నిర్ణయించారు.

ఒక బిల్లింగ్ సైకిల్లో ఇంధనంపై రూ.50 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఒక శాతం అదనంగా రుసుంలు విధించనున్నారు. రూ.50 వేల కంటే తక్కువ ఉంటే సర్ ఛార్జీలు వర్తించవు. ఉదాహరణకు రూ.60 వేలు ఖర్చు చేస్తే రూ.600 అదనంగా ఛార్జీలు పడతాయి. అదనంగా మరికొన్ని ఛార్జీలు కూడా పడతాయి. 5172, 5542, 5541, 5983 వర్తకుల కేటగిరీ కోడ్లకు ఇవి వర్తిస్తాయి.

దీంతో ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారు తమ లావాదేవీలను పరిశీలించుకోండి. ప్రతీ నెలలో ఇంధన, రవాణా ఛార్జీల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారనేది పరిశీలించండి. బిల్లింగ్ సైకిల్ ప్రారంభం, ముగింపు తేదీలను తనిఖీ చేయండి. లావాదేవీలు ఏ వ్యాపారి వర్గం కిందకు వస్తాయనేది గమనించండి. దీని వల్ల అదనపు ఛార్జీల నుంచి బయటపడే అవకాశముంటుంది.