
Gas Cylinder Tips: ఈ రోజుల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లేనిదంటే ఉండదేమో. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్‌ను వాడుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. చాలా మంది గ్యాస్‌ను వృధా చేస్తుంటారు. మీ వంట గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని సమర్థవంతంగా పెంచడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఈ సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా మీకు సాధారణంగా నెల రోజుల పాటు వచ్చే గ్యాస్ ఏకంగా 45 రోజుల పాటు వస్తుంది. అంటే 15 రోజులు ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా మీరు ఏడాదికి ఎంతో గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు.

మొదట స్టవ్ వెలిగించినప్పుడు మంట ఎప్పుడూ నీలం రంగులో ఉండాలి. మంట ఎరుపు లేదా పసుపు రంగులో ఉన్నట్లయితే బర్నర్ రంధ్రాలు పూడుకుపోయాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో గ్యాస్ ఎక్కువగా వాడకం అవుతుంది. దీంతో మీ గ్యాస్ ఎక్కువగా వృథా అవుతుంది. అందుకే బర్నర్లను వెంటనే శుభ్రం చేయాలి. వంట చేసేటప్పుడు పాత్రపై మూత పెట్టడం తప్పనిసరి అని గుర్తించుకోండి. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉండి, ఆహారం త్వరగా ఉడుకుతుంది. తద్వారా 30% గ్యాస్ ఆదా అవుతుంది.

స్టవ్ మీద వండే పాత్రలు పెట్టే ముందు అది తడిగా ఉండకూడదు. పొడిగా ఉండాలి. తడిగా ఉంటే పాత్ర వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అందులో ఉండే నీరు అవిరి కావాలి. అప్పుడు వండేందుకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల కూడా గ్యాస్ వృధా పోతుంది. అందుకే వండే పాత్రలో ఎలాంటి నీటి బిందులులు ఉండకూడదు.

పప్పులు, బియ్యం లేదా శనగలు వంటివి వండే ముందు కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టండి. దీంతో అవి త్వరగా ఉడుకుతాయి. వంట సమయం తగ్గి గ్యాస్ ఆదా అవుతుంది. మీరు వీలైనంత వరకు ఎక్కువగా వంటలను ప్రెజర్ కుక్కర్‌లో చేయడం మంచిది. ఎందుకంటే వంట త్వరగా అవుతుంది. దీంతో గ్యాస్ ఎంతో ఆదా చేసుకోవచ్చు. సాధారణ పాత్రల కంటే కుక్కర్‌లో వంట త్వరగా అవుతుంది. గ్యాస్ వినియోగం తగ్గుతుంది.

పెద్ద బర్నర్‌పై చిన్న గిన్నె పెట్టి వండకూడదని గుర్తించుకోండి. మంట గిన్నె దాటి బయటికి వస్తే అది గ్యాస్ వృథా అవుతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో వంట చేయడం అలవాటు చేసుకోండి. ఈ చిట్కాల ద్వారా మీరు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.