
దీపావళి పండుగ వస్తుండటంతో పెద్ద మొత్తంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ జరిగే అవకాశముంది. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్యాస్ సరఫరాలో అవాంతరాలు లేకుండా డెలివరీ చేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్యాస్ పంపిణీ ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ధర్నాలు, నిరసనలను విరమించుకోవాలని సూచించింది. ప్రజలకు త్వరగా డెలివరీ అందించాలని సూచనలు జారీ చేసింది.

తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ వేదికగా నిరవధిక సమ్మె చేపట్టాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. ఈ సమ్మెను ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎల్‌డిఐ) వ్యతిరేకించింది. అక్టోబర్ 26వ తేదీ నుంచి సమ్మెకు గ్యాస్ పంపిణీదారులు పిలుపునిచ్చారు. అయితే గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు సమ్మెకు దిగితే సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముంటుంది. పండుగ సీజన్ కారణంగా ప్రజలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు పొందటంలో జాప్యం జరిగే ఛాన్స్ ఉంటుంది

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పండుగ సీజన్ కారణంగా సమ్మెను విరమించుకోవాలని సూచించింది. డిస్ట్రిబ్యూటర్లతో కేంద్ర పెట్రోలియం శాఖ చర్చలు జరుపుతోంది. వినియోగదారులకు సరఫరాను కొనసాగించాలని, పంపిణీ చేయడంలో జాప్యం జరగకూడదని హెచ్చరించింది. అయితే ఈ సమ్మెపై స్పందించిన ఎఫ్‌ఎల్‌డీఐ సంస్థ.. ఈ ఆందోళనలకు తమ మద్దతు లేదని ప్రకటించింది. పంపిణీదారులు ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది.

ప్రభుత్వంతో అర్థవంతమైన చర్చలు జరపడం ముఖ్యమని ఎఫ్ఎల్‌డీఐ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, కేంద్ర పెట్రోలియంశాఖతో చర్చలు జరుపుతున్నామని, ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసింది. త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది. చర్చల ద్వారా ఒక పరిష్కారం కనుగొనవచ్చని, నిర్ణయాత్మక చర్యలను పాటించాలని పేర్కొంది.

ఏ కుటుంబానికి అసౌకర్యం కలగకుండా గ్యాస్ సరఫరాను కొనసాగించడమే తమ లక్ష్యమని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. డెలివరీ కమిషన్లు, ఈకేవైసీ ఛార్జీల చెల్లింపు గురించి ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఢిల్లీలో 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.942గా ఉండగా.. చెన్నైలో రూ.957గా కొనసాగుతోంది. అటు ముంబైలో రూ.941గా ఉంది.