
నవంబర్ నెల వస్తుండటంతో దేశ ప్రజలను ఆర్దికంగా ప్రభావితం చేసే అనేక కొత్త నియమాలు అందుబాటులోకి వస్తున్నాయి. నెల మారుతుందంటే చాలు.. ప్రతీసారి అనేక కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటాయి. అలాగే వచ్చే నెల నుంచి కూడా కొత్త నిబంధనలు వస్తున్నాయి. వీటి గురించి దేశంలో నివసించే ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. వచ్చే నెల నుంచి దీనికి సంబంధించి కొత్త రూల్స్ వస్తున్నాయి.

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు ఆధార్ ఈ-కేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో గృహ సిలిండర్లు వాడే ప్రతీఒక్కరి తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి చేయనివారికి నవంబర్ నుంచి సబ్సిడీ ఆధారిత సిలిండర్లు నిలిపివేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో వీరికి కేవలం 5, 10 కిలోల సిలిండర్లను మాత్రమే సరఫరా చేసే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నరు. పూర్తి చేయనివారు ఇప్పటికైనా కేవైసీ పూర్తి చేయడం మంచిది. దీని వల్ల వచ్చే నెల నుంచి గ్యాస్ పొందంటంలో ఎలాంటి అవాంతరాలు ఉండవు.

ఆన్లైన్ విధానంలో కూడా గ్యాస్ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ ఫేస్ ఆర్డీ, మీ గ్యాస్ కంపెనీ యాప్ ఉపయోగించి నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. ఇక మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి కూడా ఈ ప్రక్రియ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్, మొబైల్, గ్యాస్ పాస్ బుక్ తీసుకెళితే సరిపోతుంది. అలాగే మీకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషీన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయవచ్చని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ మూడు విధానాల్లో కేవైసీ చేసుకోవచ్చు.

ఇక నవంబర్ 1వ తేదీ నుంచి గ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత కొద్ది నెలలుగా 14 కిలోల గృహ సిలిండర్ల ధరలు స్థిరంగా కొనసాగుతోండగా.. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. నవంబర్ 1 నుంచి మరోసారి వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. నవంబర్ 1న కొత్త ధరలను చమురు సంస్థలు ప్రకటించనున్నాయి. దీపావళి పండక్కి ముందే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

పైప్డ్ నేచురల్ గ్యాస్ తీసుకునేవారికి గ్యాస్ సరఫరాదారు నిర్ణయించే వ్యయాల ఆధారంగా ఛార్జీలు నిర్ణయించనున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ఎలా ఉన్నా.. దేశీయంగా గ్యాస్ సేకరణ నిష్పత్తిని బట్టి ధరలు నిర్ణయిస్తారు. పీఎన్జీలోకి మారాలనుకువారు ఈ నిబంధనలను గమనించాలి. ఇలా నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ విధానంలో మార్పులు వస్తున్నాయి.