
24K vs 22K Gold: బంగారం కొనేటప్పుడు అందరికీ ఎదురయ్యే అతిపెద్ద సందేహం "క్యారెట్" (Carat). అసలు క్యారెట్ అంటే ఏమిటి? 24 క్యారెట్లకు, 22 క్యారెట్లకు మధ్య తేడా ఏంటి? ఏ బంగారం ఆభరణాలకు మంచిది? ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

క్యారెట్ (Carat) అంటే ఏమిటి?: బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణమే 'క్యారెట్'. దీనిని 0 నుండి 24 వరకు లెక్కిస్తారు. క్యారెట్ విలువ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. బంగారం సహజంగా చాలా మెత్తగా ఉంటుంది. అందుకే దానిని గట్టిపరచడానికి రాగి, వెండి, నికెల్ వంటి లోహాలను కలుపుతారు. ఆ మిశ్రమం ఎంత మోతాదులో ఉందనేది క్యారెట్ ద్వారా తెలుస్తుంది.

24 క్యారెట్ల బంగారం (24K Gold): ఇది అత్యంత స్వచ్ఛమైన బంగారం. దీనిని 999 గోల్డ్ అని కూడా పిలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో ఇతర లోహాలు ఏవీ ఉండవు. ఇది ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనితో ఆభరణాలు చేయడం కష్టం. అందుకే దీనిని బంగారు బిస్కెట్లు, కడ్డీల రూపంలో పెట్టుబడి (Investment) కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.

22 క్యారెట్ల బంగారం (22K Gold): ఆభరణాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని 916 గోల్డ్ అని అంటారు. ఇందులో 91.6 శాతం బంగారం, మిగిలిన 8.4 శాతం రాగి, జింక్ వంటి లోహాలు ఉంటాయి. ప్రత్యేత ఏంటంటే..ఇతర లోహాలు కలపడం వల్ల ఇది గట్టిపడుతుంది. 24 క్యారెట్ల కంటే ఇది కొంచెం ముదురు రంగులో ఉంటుంది. ఇక ఉపయోగం విషయానికొస్తే.. సాధారణ బంగారు నగలు, గాజులు, గొలుసుల తయారీకి ఇది సరైనది.

18 క్యారెట్ల బంగారం (18K Gold): దీనిని 750 గోల్డ్ అని కూడా పిలుస్తారు. స్వచ్చత విషయానికొస్తే.. ఇందులో 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఇది 22 క్యారెట్ల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే ఎక్కువ మన్నిక (Durability) కలిగి ఉంటుంది. దీని వల్ల కూడా ఉపయోగాలున్నాయి. వజ్రాలు (Diamonds), ఇతర విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాల తయారీలో 18కే బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే రాళ్లను గట్టిగా పట్టి ఉంచడానికి బంగారం దృఢంగా ఉండాలి.

14 క్యారెట్ల బంగారం (14K Gold): దీని స్వచ్ఛ ఇందులో 58.3 శాతం బంగారం, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. ఇది చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీనికి మన్నిక చాలా ఎక్కువ కానీ బంగారం శాతం తక్కువగా ఉండటం వల్ల మెరుపు తక్కువగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాలనుకునే వారు 24 క్యారెట్ల బిస్కెట్లు, ఆభరణాలు చేయించుకోవాలనుకునే వారు 22 లేదా 18 క్యారెట్లను ఎంచుకోవడం ఉత్తమం.