
Gold Price: భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అది సంస్కృతి, నమ్మకం, ఐశ్వర్యం, శ్రేయస్సుకు సంకేతం. పండుగలు, వివాహాలు, అక్షయ తృతీయ వంటి విశేష సమయాల్లో బంగారం కొనుగోలు చేయడాన్ని ప్రజలు ఎంతో శుభసూచకంగా భావిస్తారు. అయితే, దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. సాధారణంగా అన్ని ప్రముఖ నగరాల్లో పసిడి ధరలు దాదాపు ఒకే విధంగా అనిపించినప్పటికీ, దేశంలోనే అత్యంత చౌకగా లభించే ఒక నగరం ఉంది. ఆ ప్రాంతం మరెక్కడో కాదు.. మన పొరుగున ఉన్న కేరళలోని ‘త్రిస్సూర్’ నగరమే కావడం విశేషం.

త్రిస్సూర్‌లో బంగారం ధరలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు: భారతదేశ పసిడి రాజధానిగా పేరుగాంచిన త్రిస్సూర్‌లో బంగారం ధరలు తక్కువగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యాపార కారణాలు ఉన్నాయి. దేశంలోనే ఇక్కడ తక్కువ ధలల్లో బంగారం లభిస్తుంది. తక్కువ రవాణా, నిర్వహణ వ్యయం: సముద్ర మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి అయ్యే పసిడి, కొచ్చి పోర్ట్ (Kochi Port) కు చేరుకుంటుంది. కొచ్చిన్‌కు చాలా దగ్గరగా ఉన్న త్రిస్సూర్ నగరానికి బంగారాన్ని తరలించడానికి లాజిస్టిక్స్, రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వ్యయం తగ్గడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే పసిడి లభిస్తుంది.

అధిక కొనుగోళ్లు, బలమైన వ్యాపార నెట్‌వర్క్: త్రిస్సూర్ నగరం పసిడి వర్తకానికి ప్రపంచస్థాయి కేంద్రం. అక్కడ హోల్‌సేల్ వ్యాపార నెట్‌వర్క్ విస్తృతంగా ఉండటంతో పాటు బంగారం వినియోగం, ఖరీదు అత్యధిక పరిమాణంలో జరుగుతుంది. దీనివల్ల వర్తకులు తక్కువ మార్జిన్‌తో విక్రయించడానికి మొగ్గు చూపుతారు.

తక్కువ స్థానిక పన్నులు: దేశవ్యాప్తంగా పసిడిపై 3 శాతం జిఎస్‌టి (GST) స్థిరంగా ఉన్నప్పటికీ, వివిధ రాష్ట్రాలు విధించే లోకల్ సెస్‌లు, ఎక్సైజ్ విధులు, హ్యాండ్లింగ్ ఛార్జీలు రాష్ట్రానికో రకంగా ఉంటాయి. కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పసిడిపై ఉండే అదనపు స్థానిక పన్ను భారం ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.

అత్యంత ప్రియమైన నగరం ఏది?:దేశంలోనే అత్యంత ఎక్కువ ధరలకు బంగారం లభించే నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అధిక రవాణా ఖర్చులు, మెట్రో నగరాల్లో ఉండే వాణిజ్య నిర్వహణ వ్యయం, స్థానిక అదనపు పన్నుల కారణంగా అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనుక బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా ఆభరణాల తయారీ కేంద్రాల నుండి వ్యాపార రీత్యా కొనుగోలు చేయాలనుకుంటే.. త్రిస్సూర్ అత్యంత అనుకూలమైన, తక్కువ ధరలు కలిగిన వేదికగా నిలుస్తోంది.