
భారతదేశంలో ఏ కరెన్సీ నోటు చూసుకున్నా జాతిపిత మహాత్మా గాంధీ ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఫొటో లేకుండా ఆర్బీఐ ఏ నోటు కూడా జారీ చేయదు. రూ.10 నోటు దగ్గర నుంచి రూ.500 నోటు వరకు ప్రతీ దానిపై గాంధీ ఫొటో ఉండాల్సిందే. 1996 నుంచి కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటోను ముద్రించడం ఆర్బీఐ శాశ్వతం చేసింది. 1996లో మహాత్మా గాంధీ ఫొటోతో కూడిన సిరీస్ నోట్లను అధికారికంగా చలామణిలోకి తీసుకొచ్చింది.

2016లో అనేక సెక్యూరిటీ ఫీచర్లతో మహాత్మా గాంధీ ఫొటోతో కూడుకున్న కొత్త సిరీస్ నోట్లను విడుదల చేసింది. తొలుత రూ.10, రూ.500 నోట్లను చలామణిలోకి తీసుకురాగా.. ఆ తర్వాత ఇతర నోట్లను ప్రవేశపెట్టింది. అయితే మన దేశ కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటోకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ ఫొటో ఎక్కడిది..? ఎప్పుడు తీశారు..? నిజమైన ఫొటోనా? లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో చేసిన ఫొటోనా? అనే విషయాలు బయటకొచ్చాయి.

కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌గా తీసిన ఫొటోనే. గ్రాఫిక్స్‌తో చేసిన ఫొటో కాదు. 1946లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బ్రిటిషన్ రాజకీయవేత్త లార్డ్ పెథిక్ లారెన్స్‌తో గాంధీ కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటో అది. ఆ ఫొటోలో గాంధీ నవ్వుతూ అనువైన హావభావాలతో ఉన్నారు. దీంతో ఆ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్నారు. ఈ ఫొటో ఎవరు తీశారనే వివరాలు మాత్రం తెలియదు.

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కింగ్ జార్జ్ VI ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించేవారు. 1949లో కేంద్రం రూపాయి నోటును జారీ చేయగా.. అందులో కింగ్ జార్జ్ స్థానంలో సారనాథ్‌లోని అశోక స్తంభంకు సంబంధించిన సింహ రాజధాని చిహ్నాన్ని చేర్చారు. 1969లో గాంధీ 100వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక సిరీస్‌ను నోట్లను జారీ చేశారు. ఇందులో తొలిసారిగా గాంధీ చిత్రాన్ని ముద్రించారు.

1996లో పాత అశోక స్తంభం కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త మహాత్మా గాంధీ సిరీస్‌ను ఆర్బీఐ ప్రారంభించింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, లేటెంట్ ఇమేజ్, ఇంటాగ్లియో ఫీచర్‌లతో పాటు అనేక భద్రతా ఫీచర్లు కూడా ప్రవేశపెట్టారు. గాంధీ ఫొటో వెనుక ఇలా ఎంతో చరిత్ర ఉంది.