
బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీ బ్యాంక్ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. రోజువారీ నగదు అవసరాల కోసం బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. దీంతో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయనేది తెలసుకోవడం ముఖ్యం. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు బంద్ అవుతాయి. జాతీయ, గెజిటెడ్ సెలవులు, రెండో శనివారం, ఆదివారంతో పాటు రాష్ట్రాల అధికారిక సెలవులు, పండుగల రోజున కూడా ఆర్బీఐ ప్రాంతాలను బట్టి సెలవులు ప్రకటిస్తుంది.

ఆర్బీఐ బ్యాంకు సెలవుల జాబితాను జనవరిలో విడుదల చేస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు మూతపడతాయి. అందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం వినాయక చవితి పండుగ రావడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణ, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో ఇవాళ బ్యాంకులు మూతపడనున్నాయి.

ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇవాళ బంద్ అవుతాయి. దీంతో ఖాతాదారులు దీనిని ముందే గమనించి చర్యలు తీసుకోవాలి. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలనుకుంటే ముందుగానే సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకోండి. సెప్టెంబర్ 12 (రెండవ శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం) రోజున బ్యాంకులు మూతపడగా.. సెప్టెంబర్ 11 శుక్రవారం బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో సేవలు ప్రభావితమయ్యాయి

సోమవారం కూడా బ్యాంకులు క్లోజ్ కానుండటంతో.. మొత్తం వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడినట్లు అయింది. తిరిగి మంగళవారం బ్యాంకులు ఓపెన్ కానున్నాయి. సెప్టెంబర్‌లో వారాంతపు సెలవులతో సహా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 రోజుల పాటు మూసివేయబడతాయి.

బ్యాంకు సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి విధానాల్లో ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఇక ఏటీఎంల ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.