
లడ్డూ అంటే చాలు చాలా మంది స్వీట్ ఉంటుంది, పిల్లలకు దగ్గు వంటి సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే చక్కెర, బెల్లం వాడకుండా ఇలా లడ్డూ చేసి పెడితే వారు ఇష్టంగా తింటారంట. అంతే కాకుండా, ఇది ఎముకల బలానికి చాలా మంచిది, అలాగే పిల్లలో మెదడు పనితీరును మెరుగు పరిచి, వారిలో తెలివితేటలను పెంచేలా చేస్తుందంట. కాగా, ఈ షుగర్ ఫ్రీ లడ్డూ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : విత్తనాలు తీసివేసిన ఖర్జూరాలు, బాదం ఒక కప్పు, జీడిపప్పు ఒక కప్పు, వాల్ నట్స్ ఒక కప్పు, పిస్తా ఒక కప్పు, అంజీర్ 8, నెయ్యి మూడు టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి చిటికెడు.

తయారీలోకి వెళితే.. ముందుగా వాల్ నట్స్, జీడి పప్పు, బాదం, పిస్తా పప్పును అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి,దానిపై పాన్ పెట్టి, అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. వేయించే క్రమంలో అవి మాడిపోకుండా చూసుకోవాలి.

వీటిని వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఖర్జూర, అంజీర్ తీసుకోవాలి. వీటిని మిక్సీ పట్టడానికి 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, వన్ టీ స్పూన్ నెయ్యి వేసి, ఖర్జూర, అంజీర్ మిశ్రమం వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే బాదం, వాల్ నట్స్, పిస్తాపప్పులు అన్నీ వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చిన్న చిన్నగా లడ్డూల్లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ షుగర్ లేని డ్రైఫ్రూట్ లడ్డూ రెడీ. ఇది పిల్లలకే కాదు, పెద్దల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.