
తెల్ల బియ్యం మన భారతీయ ఆహారంలో అత్యంత ప్రధానమైనది. తెల్ల బియ్యం రెండు సార్లు పాలిష్ చేయడం వలన అందులోని ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, బి కాంప్లెక్స్ విటమిన్లు, యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు వంటి కీలక పోషకాలన్నీ పై పొరలోనే తొలగిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాలన్నీ తవుడులోకి వెళ్ళిపోతాయి, ఇది పశువులకు బలమైన మేతగా మారుతుందని పేర్కొన్నారు.

తెల్ల బియ్యంలో పోషకాలు లేకపోవడం వల్ల పురుగు కూడా పట్టదని, కానీ మనుషులు మాత్రం దీనిని తింటున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనిని "జీరో న్యూట్రియంట్స్, ఎంప్టీ కార్బోహైడ్రేట్స్" అని ఆయన చెబుతున్నారు. తెల్ల బియ్యం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 73. దీని అర్థం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగినప్పుడు, శరీరం దాన్ని కొవ్వుగా మార్చుతుంది. ఇది బరువు పెరగడానికి, మధుమేహం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి, చివరికి గుండె జబ్బులకు దారితీస్తుందని చెబుతున్నారు.

అందుకే నిపుణులు నల్ల బియ్యాన్ని తినాలని చెబుతున్నారు. ఇది ఎరుపు బియ్యం, బ్రౌన్ బియ్యం మాదిరిగానే తెల్ల బియ్యానికి ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. నల్లగా, కాస్త లావుగా ఉండే ఈ బియ్యాన్ని పాలిష్ పట్టరు. పరిశోధకులు నల్ల బియ్యంలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను వెల్లడించారు.

నల్ల బియ్యం పోషకాల నిధి. 100 గ్రాముల నల్ల బియ్యంలో 355 క్యాలరీలు, 75.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9 గ్రాముల ప్రొటీన్, 3.3 గ్రాముల కొవ్వు మరియు 2.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 42, ఇది తెల్ల బియ్యంతో పోలిస్తే చాలా తక్కువ. అంటే, నల్ల బియ్యం నుండి గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదల అవుతుంది, తద్వారా చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

నల్ల బియ్యం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం దాని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్. దీనిలో 23 రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని సైంటిస్టులు నిరూపించారు. ఒక గ్రాము బియ్యంలో 190 మైక్రోగ్రాముల క్వర్సెటిన్, 1400 మైక్రోగ్రాముల ఆంథోసయనిన్స్ 290 మైక్రోగ్రాముల ఒరిజనల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కణజాలాలను వ్యాధుల బారి నుండి రక్షించడానికి, కణాలను రిపేర్ చేయడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి మరియు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.