
ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిదేనా?: చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవగానే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం ఒక అలవాటు. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయని నమ్ముతారు. కానీ నిపుణులు దీనిని ఖండిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే టానిన్లు కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతాయి. దీనివల్ల తీవ్రమైన ఎసిడిటీ లేదా కడుపులో మంట రావచ్చు. వికారం కలిగే అవకాశం ఉంది. కొందరిలో మలబద్ధకం సమస్య తలెత్తవచ్చు. ఏదైనా బిస్కెట్లు లేదా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాతే గ్రీన్ టీ తాగాలి.

రాత్రి వేళల్లో నిద్రకు భంగం కలిగించే కెఫిన్: గ్రీన్ టీని హెర్బల్ డ్రింక్ అని పిలిచినప్పటికీ, అందులో స్వల్ప మొత్తంలో కెఫిన్ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు దీనిని తాగడం వల్ల మీ మెదడు చురుగ్గా మారి, నిద్ర లేమి సమస్యకు దారితీస్తుంది. ఒకవేళ మీరు రాత్రిపూట తాగాలనుకుంటే, నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే తాగడం ముగించాలి. జీర్ణక్రియ కోసం తీసుకునే వారు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

భోజనానికి, గ్రీన్ టీకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి: మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, ముఖ్యంగా ఐరన్‌ను శరీరం గ్రహించకుండా గ్రీన్ టీ అడ్డుకుంటుంది. అందుకే భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యకరం కాదు. భోజనానికి గంట ముందు లేదా భోజనం చేసిన 45-60 నిమిషాల తర్వాత తీసుకోవడం ఉత్తమ సమయం. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు శరీరానికి బాగా అందుతాయి.

తయారీలో చేసే పొరపాట్లు: గ్రీన్ టీని మనం సాధారణ టీ లాగా మరిగించకూడదు. నీటిని బాగా మరిగించి, ఆపై స్టవ్ ఆపివేసి ఒక నిమిషం తర్వాత గ్రీన్ టీ ఆకులు లేదా బ్యాగ్‌ను వేయాలి. మరీ వేడి నీటిలో వేస్తే ఆకులు కాలిపోయి చేదు పెరుగుతుంది, పోషకాలు నశిస్తాయి. టీ బ్యాగ్‌ను 2 నుండి 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు నీటిలో ఉంచకూడదు.

గ్రీన్ టీ - రోజుకు ఎన్ని కప్పులు?: అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని రోజంతా తాగుతూనే ఉండకూడదు. రోజుకు 2 నుండి 3 కప్పులు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కాలేయం పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీన్ టీ నిస్సందేహంగా ఆరోగ్యానికి ఒక వరం. కానీ అది అమృతంలా పనిచేయాలంటే దానిని సరైన సమయంలో, పరిమితంగా తీసుకోవడం ముఖ్యం.