
చాలామంది పువ్వులు ఎక్కువగా రావాలని అతిగా నైట్రోజన్, పొటాషియం ఎరువులు వేస్తుంటారు. కానీ అధిక మోతాదులో ఎరువులు వేయడం, అవసరానికి మించి నీళ్లు పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోవడమే కాకుండా.. ఆకుల అడుగున కంటికి కనిపించని సూక్ష్మ పురుగులు, పేనుబంక, పిండినల్లి ఆశించి మొక్క ఎదుగుదలను దెబ్బతీస్తాయి. ఈ తెగుళ్లన్నింటినీ అరికట్టి మొక్కలు తిరిగి నర్సరీలా గుత్తులు గుత్తులుగా పూలు పూయడానికి మన వంటింట్లోని 'వంట సోడా' ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ ఆర్గానిక్ స్ప్రే తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు-కొలతలు: 2 లీటర్ల నీళ్లు, లీటరుకు 1 స్పూన్ చొప్పున 2 చెంచాల వంట సోడా, లీటరుకు 5 ml చొప్పున 10 ml వేప నూనె-ఒకవేళ వేపనూనె లేకపోతే సాధారణ వంట నూనె కూడా వాడుకోవచ్చు, నీటిలో నూనె సమంగా కరగడానికి 5 చుక్కల హ్యాండ్ వాష్ / షాంపూ / సర్ఫ్.

రెండు లీటర్ల వాటర్ స్ప్రేయర్ బాటిల్‌లో మంచి నీటిని తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల వంట సోడా వేయాలి. ఆ తర్వాత 10 ml వేప నూనె మరియు 5 చుక్కల హ్యాండ్ వాష్ లేదా షాంపూ వేయాలి. వేప నూనె నీటితో సమంగా కలవడానికి ఈ లిక్విడ్ సోప్ ఎంతో ముఖ్యం. మూత గట్టిగా పెట్టి బాటిల్‌ను ఒకటికి రెండుసార్లు బాగా షేక్ చేసి కలపాలి.

వర్షాకాలం, చలికాలంలో ఉదయం 7 గంటల తర్వాత లేత ఎండ ఉన్న సమయంలో మాత్రమే స్ప్రే చేయాలి. సాయంత్రం వేళల్లో మంచు పడుతున్నప్పుడు స్ప్రే చేస్తే ద్రావణం సరిగ్గా పనిచేయదు. సహజంగా వర్షం పడినప్పుడు మొక్క ఎలా తడుస్తుందో.. అలాగే ఆకుల అడుగుభాగంలో, కాండం వద్ద, మొగ్గలపై మొక్క మొత్తం తడిసేలా స్ప్రే చేయాలి.

మొక్కలకు ఆకు ముడత, తెల్ల పిండినల్లి తీవ్రంగా ఉంటే ప్రతి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. సాధారణ నివారణ కోసం అయితే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. స్ప్రే చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు పాత ఆకులు రాలిపోయినా కంగారు పడాల్సిన పనిలేదు; వెంటనే కొత్త చిగుళ్లు, బలిష్టమైన మొగ్గలు రావడం మొదలవుతాయి.

అదనపు సంరక్షణ జాగ్రత్తలు: మొక్కకు రోజుకు 6 నుండి 8 గంటల పాటు తప్పనిసరిగా సూర్యరశ్మి తగలాలి. అలాగే కుండీలోని పై మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ తేమ ఉంటే వేర్లు పాడైపోతాయి. ఈ సహజసిద్ధమైన వంట సోడా స్ప్రేను పూల మొక్కలకే కాకుండా కూరగాయలు, పండ్ల మొక్కలకు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు!