
కావలసిన పదార్థాలు :150 గ్రాముల కందిపప్పు, 4 మీడియం సైజు పెద్ద ముక్కలుగా తరిగిన నాటు టమాటాలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 1 టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు, వంట నూనె, 2 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర తరుగు, ఘుమఘుమలాడే తాలింపు కోసం: 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మినప్పప్పు, 2 తుంచిన ఎండుమిరపకాయలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ తాజా కరివేపాకు

తయారీ విధానం: ఒక ప్రెజర్ కుక్కర్లో 150 గ్రాముల కందిపప్పును తీసుకుని నీటితో రెండు సార్లు శుభ్రంగా కడగాలి. పప్పు మునిగేలా తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి. నానిన పప్పులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటాలు, పెద్దగా కోసిన 1 ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం వేయాలి. నీళ్లు తక్కువగా ఉంటే ముక్కలు మునిగేలా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి.

పొంగిపోకుండా ఉండేందుకు 1 టీస్పూన్ నూనె వేసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి విజిల్ ఉంచి.. మీడియం మంటపై 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. పప్పు మెత్తగా ఉడికి ఉంటుంది కాబట్టి గరిటెతో లేదా పప్పుగుత్తితో టమాటా ముక్కలు పప్పుతో కలిసిపోయేలా బాగా మెదపాలి.

ఒక చిన్న నిమ్మకాయంత చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టి తీసిన చింతపండు గుజ్జును ఇందులో పోయాలి. బాగా కలిపి.. పప్పు కొద్దిగా జారుడు పల్చదనంతో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్‌ను స్టవ్‌పై పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించాలి. వేరొక చిన్న గిన్నె లేదా పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలి.

ఆ తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వేడి వేడి పోపును ఉడుకుతున్న పప్పులోకి పోసి వెంటనే కలపాలి. తాలింపు వేసిన తర్వాత మీడియం మంటపై పప్పును మరో 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించాలి.

చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే కమ్మని 'ఆంధ్రా టమాటా పప్పు' సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ పప్పును పోసి, చెంచాడు స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని.. నంజుకోవడానికి బంగాళదుంప వేపుడు లేదా ఆవకాయతో తింటుంటే పులుపు, కారం, వెల్లుల్లి తాలింపు ఘుమఘుమలతో కడుపు నిండా సంతృప్తిగా తినేస్తారు!