
ఇంటిలో నిత్యం చేసుకునే టిఫిన్స్, అలాగే వేడి వేడి అన్నంతో పాటు నెయ్యి వేసుకుని తినడానికి అనువుగా ఉండే టొమాటో పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని సులభంగా తయారు చేసుకుని, పుల్లపుల్లని, కారం కారమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ టొమాటో పచ్చడిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, పూర్తి తయారీ విధానం కింద వివరించబడ్డాయి.

కావలసిన పదార్థాలు.. టమాటాలు – 5 (సుమారు 300-350 గ్రాములు, బాగా పండినవి), నూనె – 3-4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్ (వేయించడానికి), పోపు కోసం కొద్దిగా, మెంతులు – ఒక చిటికెడు, ధనియాలు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 6 (మీ కారానికి సరిపడా), వెల్లుల్లి రెబ్బలు – 5-6 (వేయించడానికి), 3 (పోపు కోసం దంచినవి), కొత్తిమీర – 1 చిన్న కట్ట (శుభ్రం చేసినది), చింతపండు – కొద్దిగా, పసుపు – 1/4 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, ఆవాలు – పోపు కోసం, శనగపప్పు – పోపు కోసం, మినపప్పు – పోపు కోసం, ఎండుమిరపకాయలు – 2 (పోపు కోసం), ఇంగువ – ఒక చిటికెడు, కరివేపాకు – 1 రెమ్మ (పోపు కోసం).. చొప్పున తీసుకోవాలి.

ముందుగా బాగా పండిన ఐదు టమాటాలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని, అందులో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, ఒక టీస్పూన్ ధనియాలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. మెంతులు ఎక్కువ వేయకూడదు, చేదు వస్తాయి. వేయించిన దినుసులు కొద్దిగా వేగాక, ఇందులో ఆరు పచ్చిమిర్చిని తుంచి వేయాలి (మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని సర్దుబాటు చేసుకోవచ్చు). ఆ తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. మంటను తక్కువ నుండి మధ్యస్థ మంటపై ఉంచి, మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక, శుభ్రం చేసుకున్న చిన్న కట్ట కొత్తిమీరను కూడా వేసి బాగా వేయించుకోవాలి. అన్ని కలిపి బాగా వేగి, కొత్తిమీర వాడిపోయే వరకు వేయించాలి. వేగిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పై మూత పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి, టమాటా ముక్కలు పూర్తిగా మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపి, వాటిని కూడా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లోని చల్లారిన పచ్చిమిర్చి మిశ్రమంలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మగ్గించిన చల్లారిన టమాటా ముక్కలను కూడా మిక్సీ జార్ లో వేసి, మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా, పల్స్ మోడ్ లో మూడు నాలుగు సార్లు గ్రైండ్ చేసి కోర్స్ గా ఉండేలా చూసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చడి రుచి అంత బాగుండదు.

సిద్ధం చేసుకున్న పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై చిన్న పాన్ పెట్టి, ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపి వేయాలి. ఆవాలు చిటపటలాడాక, కచ్చాపచ్చాగా దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించి, స్టవ్ ఆపి, ఈ పోపును టొమాటో పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే రుచికరమైన టొమాటో పచ్చడి సిద్ధం. దీనిని ఇడ్లీ, దోశ, వడ, బోండా వంటి టిఫిన్స్ తో పాటు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.