
అరకిలో ఉసిరికాయలను ఒక గిన్నెలో వేసి, కొద్దిగా ఉప్పు వేసి, నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఉప్పునీటితో కడగడం వల్ల దుమ్ము తొలగిపోయి, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాయలను రుద్దుతూ కడిగి, ఒక జాలిగిన్నెలోకి తీసుకోండి. కడిగిన ఉసిరికాయలను ఒక పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచి, మరో క్లాత్ పైన అరగంట పాటు గాలికి ఆరనివ్వండి.

ఉసిరికాయలు ఆరిన తర్వాత, కాయల మీద ఉన్న సహజమైన లైన్స్ వెంట చాకుతో లోపల వరకు కోయండి. కొద్దిగా ఒత్తితే తొనలు సులభంగా విడిపోతాయి. గింజలను తీసివేసి, ఉసిరి తొనలను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఒక పాన్లో ఒక టీస్పూన్ మెంతులు వేసి, చిన్న మంటపై ఎర్రగా వేయించండి. మాడిపోకుండా చూసుకోండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే పాన్లో ఒక టేబుల్స్పూన్ ఆవాలు వేసి, ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ రెండింటినీ చల్లార్చి, మెత్తగా పొడి చేసుకోండి. ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి లేదా దంచి పక్కన పెట్టుకోండి.

ఒక కప్పు పల్లి నూనెను పాన్లో వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి, మధ్యస్థ మంటపై ఐదు నిమిషాల పాటు వేయించండి. ముక్కలు పూర్తిగా మెత్తబడకుండా, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. వేగిన ముక్కలను నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోండి.ముక్కలు వేయించిన అదే నూనెలో అర టీస్పూన్ ఆవాలు, మూడు-నాలుగు ఎండుమిర్చి తుంపి వేయండి. ఒక వెల్లుల్లి గడ్డ రెబ్బలను తీసి వేసి, కొద్దిసేపు వేగనివ్వండి. పోపు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కొద్దిగా కరివేపాకు, అర టీస్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడికే పోపు చక్కగా వేగుతుంది. పోపును పూర్తిగా చల్లారనివ్వాలి. ఉసిరికాయ ముక్కలు, పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి కలపాలి. స్టీల్ పాత్రలు పచ్చడికి మంచివి కావు. చల్లారిన ఉసిరికాయ ముక్కల్లో అర కప్పు కారం, 1/3 కప్పు ఉప్పు, ముందుగా పొడి చేసుకున్న మెంతి-ఆవాల పొడి వేసి బాగా కలపాలి.

తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, మూడు టేబుల్స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. నిమ్మరసం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. చింతపండు గుజ్జును కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.పూర్తిగా చల్లారిన పోపును ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మొదట్లో నూనె తక్కువగా అనిపించినా, మరుసటి రోజుకు నూనె పైకి తేలుతుంది.

పచ్చడిని బాగా కలిపి, ముక్కలు పైకి రాకుండా కొంచెం లోపలికి నొక్కి మూత పెట్టి ఒక రోజు పాటు అలా వదిలేయాలి. మూతలు, స్పూన్కు తడి లేకుండా చూసుకోండి, లేదంటే పచ్చడి పాడవుతుంది. మరుసటి రోజు ఉదయం నూనె పైకి తేలి ఉంటుంది. పచ్చడిని మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మూడు రోజుల పాటు అదే బౌల్లో ఊరనివ్వాలి, రోజూ ఒకసారి కలుపుతూ ఉండాలి. మూడు రోజుల తర్వాత రుచి చూసి, అవసరమైతే కారం, ఉప్పు లేదా పులుపు సర్దుబాటు చేసుకోవచ్చు. పచ్చడిని గాజు జార్లలోకి తీసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది.