
కావలసిన పదార్థాలు: 1 కప్పు పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగిన తాజా అల్లం, 1 కప్పు పంచదార, 1 కప్పు సేంద్రియ బెల్లం పొడి, చిటికెడు ఉప్పు , అల్లం ముక్కలు గ్రైండ్ చేయడానికి కేవలం 5 ml నీళ్లు, ప్లేట్‌కు రాయడానికి కొద్దిగా నెయ్యి లేదా వంట నూనె

తయారీ విధానం: మంచి నాణ్యమైన తాజా అల్లాన్ని తీసుకుని పైపొట్టును పూర్తిగా చెక్కేయాలి. నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ముక్కలు నలగకపోతే కేవలం ఒకట్రెండు చెంచాల నీళ్లు సుమారు 5 ml మాత్రమే చిలకరించి నునుపైన పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇదే మిక్సీ జార్‌లో ఒక కప్పు పంచదార, ఒక కప్పు బెల్లం పొడి కూడా వేసి ఒక్కసారి తిప్పితే అల్లం పేస్ట్‌తో పాటు చక్కగా కలిసిపోతుంది. మొత్తం పంచదారతో చేస్తే గట్టిగా రావచ్చు, లేదా మొత్తం బెల్లంతో చేస్తే బిళ్ళ కట్టడం కష్టమవుతుంది; అందుకే సమాన నిష్పత్తిలో తీసుకోవడం ముఖ్యం.

స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి.. గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, బెల్లం, పంచదార మిశ్రమాన్ని వేయాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. వేడికి పంచదార, బెల్లం కరిగి మిశ్రమం లిక్విడ్‌లా మారుతుంది. ఈ సమయంలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి.

కొద్దిసేపటికి మిశ్రమం చిక్కబడి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని కొద్దిగా మిశ్రమాన్ని నీటిలో వేసి చెక్ చేయాలి. చేతి వేళ్లతో దాన్ని తాకినప్పుడు చేతికి అంటుకోకుండా, మృదువైన ఉండలా మారితే పాకం పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

ముందుగానే నెయ్యి లేదా నూనె రాసి ఉంచుకున్న స్టీల్ ప్లేట్‌పై లేదా బటర్ పేపర్‌పై ఈ వేడి మిశ్రమాన్ని వెంటనే పోసి సమానంగా పలుచగా పరుచుకోవాలి. మిశ్రమం చల్లారితే పొడిపొడిగా రాలిపోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా పోయాలి. మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో మనకు నచ్చిన సైజులో చతురస్రాకారంలో గాట్లు పెట్టుకోవాలి. గంటపాటు పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత చాకుతో కదిలిస్తే అద్భుతమైన అల్లం మురబ్బా బిళ్ళలు విడివడి వస్తాయి. వీటిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిస్తే నెలల తరబడి తాజాగా ఉంటాయి. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు రోజుకో ముక్క చప్పరిస్తే క్షణాల్లో ఉపశమనం కలుగుతుంది