
మనం ఇంట్లోనే చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోగలిగే ఒక రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గురించి ఇక్కడ చూద్దాం.. ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ, దోసెలు బోర్ కొట్టినప్పుడు, బయటి టిఫిన్ జోలికి పోకుండా, ఈ బియ్యం, బంగాళదుంప టిఫిన్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని రుచి మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

కావాల్సిన పదార్థాలు: రేషన్ బియ్యం: 1 కప్పు, బంగాళదుంప: 1, చిన్న ఉల్లిపాయ: 1, అల్లం ముక్కలు: చిన్నవి, పచ్చిమిర్చి: కారానికి తగ్గట్టు, జీలకర్ర: 1/4 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: సరిపడా తీసుకోవాలి. ముందుగా, ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒకటి లేదా రెండుసార్లు నీటితో బాగా కడుక్కోవాలి. రేషన్ బియ్యంలో కాస్త చెత్త ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి నీరు తెల్లగా మారేవరకు కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత, ఈ బియ్యాన్ని కనీసం మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఉదయం టిఫిన్ కోసం అనుకుంటే, రాత్రి పూట నానబెట్టుకోవడం మంచిది.

నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపను చేర్చాలి. బంగాళదుంపను ఉడికించి పైన పొట్టు తీసి వేసుకోవచ్చు, లేదా పచ్చి బంగాళదుంప పొట్టు తీసి ముక్కలుగా చేసి వేసుకున్నా పర్వాలేదు. అలాగే, ఒక చిన్న ఉల్లిపాయను, సన్నగా తరిగిన అల్లం ముక్కలను, మీ కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని, పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి.

ఈ పదార్థాలన్నిటినీ కలిపి, మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిశ్రమం చాలా స్మూత్‌గా ఉండాలి. ఈ రుబ్బిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకోవాలి. పిండిని బౌల్‌లోకి తీసుకున్న తర్వాత, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. దీని వలన పిండి చక్కగా సెట్ అవుతుంది.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, లోతుగా ఉన్న బాణలిని పెట్టుకోవాలి. అందులో అర స్పూన్ వరకు నూనె వేసి, నూనె వేడైన తర్వాత బాణలి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్‌ను రెండు గరిటెలు తీసుకొని బాణలిలో వేసి కాస్త మందంగా పరుచుకోవాలి. పిండి వేసిన తర్వాత, ఫ్లేమ్‌ను మీడియంకి తగ్గించి, మూత పెట్టాలి. ఒక వైపు మంచి రంగు వచ్చాక, రెండో వైపుకు తిప్పుకోవాలి. మనం వేసిన నూనె పూర్తిగా పీల్చుకోకుండా, మిగిలిన పిండిని కాల్చడానికి కూడా సరిపోతుంది. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు, చుట్టూ క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్‌గా ఉండేలా కాల్చుకోవాలి.