THIRD FRONT: బీజేపీయేతర కూటమి దిశగా యత్నాలు ముమ్మరం.. కమలంపై వ్యతిరేకతలో ఏకత్వం.. కాంగ్రెస్‌తో దోస్తీపై భిన్నత్వం

|

Sep 13, 2022 | 3:16 PM

BJPని ఢీకొట్టేందుకు అదే స్థాయిలో బల సమీకరణ జరగాలి. కానీ జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీని బూచిగా చూపిస్తున్న పలు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తున్నట్లు కనిపిస్తూనే ఏకత్వంలోను భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి

THIRD FRONT: బీజేపీయేతర కూటమి దిశగా యత్నాలు ముమ్మరం.. కమలంపై వ్యతిరేకతలో ఏకత్వం.. కాంగ్రెస్‌తో దోస్తీపై భిన్నత్వం
Follow us on

THIRD FRONT EFFORTS ON ANTI BJP STAND CLEAR: ఎదురుగా వున్నది మహా పర్వతం.. దాన్ని ఢీకొట్టేందుకు అదే స్థాయిలో బల సమీకరణ జరగాలి. కానీ జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీని బూచిగా చూపిస్తున్న పలు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తున్నట్లు కనిపిస్తూనే ఏకత్వంలోను భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా ‌చేస్తున్న వారు ప్రయత్నాలు, నిర్వహిస్తున్న భేటీలను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. బీజేపీని ఢీకొనే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లేదంటూనే ఆ పార్టీతో కలిసే విపక్షాల కూటమిని రూపకల్పన చేసేందుకు విపక్ష పార్టీల నేతలు యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాంటప్పుడు యూపీఏ (UPA) కాకుండా ఇంకో కూటమి ఎందుకు అన్న సందేహం కలగక మానదు. అయితే, బీజేపీయేతర కూటమిని కట్టేందుకు యత్నిస్తున్న వారిలో శరద్ పవార్ (Sharad Pawar), నితీశ్ కుమార్ (Nitish Kumar) వంటి నేతలు కాంగ్రెస్ పార్టీని కలుపుకునే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదేసమయంలో మమతాబెనర్జీ (Mamata Banerjee), కేసీఆర్ (KCR) లాంటి వారు మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చలు జరపకుండానే బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తెస్తామంటున్నారు. నిజానికి మమతా బెనర్జీ, కేసీఆర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతోను, సోనియా (Sonia)తోను సమాలోచనలు జరిపిన వారే. 2014లో తెలంగాణ (Telangana) ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే తమ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ రాజకీయం చేస్తూ వచ్చారు. అందుకే కేంద్రంలోని మోదీ (Modi) ప్రభుత్వానికి పలు కీలక సందర్భాలలో సహకరిస్తూ వచ్చారు. కానీ 2019 తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇపుడు కాంగ్రెస్ బదులుగా బీజేపీనే కేసీఆర్ తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. బీజేపీ ఉనికి దేశానికే ప్రమాదకరమనే స్థాయిలో కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. ఇక మమతా బెనర్జీ కూడా ఒకట్రెండు సందర్భాలలో సోనియాతో భేటీలు నిర్వహించారు. మొన్నటి బెంగాల్ ఎన్నికలకు ముందు దీదీ స్వయంగా న్యూఢిల్లీ (New Delhi) వెళ్ళి సోనియాతో సమావేశమయ్యారు. కానీ కారణమేదైతేనేం ఆ భేటీ నుంచి చాలా ముభావంగా నిష్క్రమించారు మమతాబెనర్జీ. ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అవగాహనకు కూడా దీదీ యత్నించలేదు. సో.. కేసీఆర్, మమతాబెనర్జీ .. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు కానీ.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పని చేసేందుకు రెడీ అవరు. మరోవైపు బీహార్‌ (Bihar)లో బీజేపీకి హ్యాండిచ్చి.. హ్యాండ్‌ సహకారంతో మళ్ళీ సీఎం పీఠమెక్కిన నితీశ్ కుమార్ మాత్రం తనకు ఆపన్న ‘హస్తం’ అందించిన హస్తం పార్టీ పట్ల కృతఙ్ఞతతోనే వున్నారింకా. అందుకే నాలుగు రోజులు ఢిల్లీలో మకాం వేసి బీజేపీయేతర కూటమికి యత్నించి, పలువురితో భేటీ అయిన నితీశ్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)తోను సమావేశమయ్యారు. ఇక బీజేపీయేతర పార్టీలతో కూటమికి చాన్నాళ్ళ నుంచి ప్రయత్నిస్తున్న కురువృద్ధ నేత శరద్ పవార్ కూడా తానే యత్నం చేసినా అందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వుండేలా చూస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో పవార్ వ్యవహరించిన తీరును సునిశితంగా పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే బోధపడుతోంది.

బీజేపీయేతర కూటమికి కేసీఆర్, మమతాబెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్ యత్నాలు ఎలా వున్నా.. తాజాగా బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) చేసిన కామెంట్లు మాత్రం ఆసక్తికరంగా వున్నాయి. బీజేపీయేతర పార్టీల కూటమికి సారథ్యం వహించాలన్న ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవాలని తేజస్వి అన్నారు. ప్రస్తుతం ఒకటి, రెండు రాష్ట్రాలలో తప్పితే కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీతో తలపడే స్థాయిలో లేదు. అలాంటప్పుడు.. మిగిలిన రాష్ట్రాలలో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా వున్న పార్టీల నేతృత్వాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించాలని ఆయనంటున్నారు. అదే పరిస్థితి ఉత్పన్నమైతే బీజేపీని గద్దె దింపే మహాక్రతువులో కాంగ్రెస్ పార్టీ పెద్ద త్యాగాన్నే చేయాల్సి వస్తుంది. బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని ముందే కుండబద్దలు కొట్టేసిన పార్టీలు రేపు విపక్ష కూటమికి మెజారిటీ మార్కును సాధిస్తే ప్రధాని పదవికి పోటీ పడక మానవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడో, నాలుగో, అయిదో స్థానానికి పరిమితమైన రాష్ట్రాల సంఖ్యే ఎక్కువ. యూపీలో కాంగ్రెస్ పార్టీ జాడే లేదు. కేవలం రెండంటే రెండు అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ చేతిలో వున్నాయి. బీహార్, జార్ఖండ్ (Jharkhand), యుపీ (UP), మహారాష్ట్ర (Maharashtra), ఏపీ (AP), తమిళనాడు (Tamilnadu), ఒడిశా (Odisha), బెంగాల్ (Bengal) సహా మరికొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలం నామమాత్రమే. ఇక రాజస్థాన్ (Rajastan), చత్తీస్ గఢ్ (Chattisgadh) రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో వున్నప్పటికీ వచ్చే ఏడు ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందన్నది అనుమానమే. తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీది రెండో స్థానమా లేక మూడో స్థానమా అంటే టక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ.. తాను ప్రారంభించిన మహా పాదయాత్రనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అంత పెద్ద రాజకీయ నిర్ణయాన్ని తీసుకుని, చావో రేవో తేల్చుకునేందుకు బయలుదేరిన రాహుల్ గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను చేపట్టే ధైర్యం చేయలేకపోతుండడం విశేషం. ఇది పార్టీ నేతల్లో నమ్మకాన్ని నీరుగార్చక మానదు. ఓవైపు బీజేపీ బాహుబలిగా కనిపిస్తుంది. ఇంకోవైపు దానిని అధికారం నుంచి దూరం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగా నిలబడాలి. అది నెహ్రూ కుటుంబీకులు మినహా మరెవరు పార్టీకి సారథ్యం వహించినా సాధ్యం కాదు. ఈక్రమంలో కాంగ్రెస్ తన పాత్రేంటో లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన సందర్భాలలో మూడో ఫ్రంట్ (Third Front) తెరమీదకి వచ్చి.. మెజారిటీ సీట్లలో గెలుపొంది అధికారం చేపట్టాయి. కానీ ఆ థర్డ్ ఫ్రంట్ (జనతాపార్టీ (Janata Party) కూటమి, నేషనల్ ఫ్రంట్ (National Front), యునైటెడ్ ఫ్రంట్ (United Front)) ప్రభుత్వాలను కూల్చింది కాంగ్రెస్ పార్టీనే. ఇందిర (Indira Gandhi) హయాంలో చౌదరీ చరణ్ సింగ్‌ను, రాజీవ్ (Rajiv Gandhi) హయాంలో చంద్రశేఖర్‌ (Chandra Shekhar)ను, సోనియా (Sonia Gandhi) హయాంలో ఇంద్రకుమార్ గుజ్రాల్‌ (Indra Kumar Gujral)ను కాంగ్రెస్ పార్టీ పావులుగా వాడుకుంది. ఆనాటి కాంగ్రెస్ వ్యూహాలను ఇంకా ఎవరూ మరువలేదు. ఈ మూడు ప్రయోగాల వైఫల్యం నేపథ్యంలో దేశంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి రావడం అంటే దేశానికి బలహీనమైన సారథి లేడు అనే భావిస్తారు. ఇది భారత దేశాన్ని ప్రపంచ దేశాలలో చులకన చేస్తుందని చాలా మంది భావన.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి