సినిమాను మించిన ట్విస్ట్.. 15 కిలోల బంగారం దోచేసిన సోషల్ మీడియా స్టార్స్.. ఎలా చిక్కారంటే..?

సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లతో సెలబ్రిటీలుగా వెలిగిపోతున్న ఒక యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కలిసి ఏకంగా 15 కిలోల బంగారం దోపిడీకి తెగబడ్డారంటే నమ్ముతారా? సినిమా కథను తలపించేలా 15 రోజుల పాటు కస్టమర్లలా నటిస్తూ రెక్కీ నిర్వహించి, ఏకంగా నగల షోరూమ్ గోడకు రంధ్రం చేసి కోట్ల విలువైన ఆభరణాలను లూటీ చేశారు. మదురైలో సంచలనం సృష్టించిన ఈ భారీ చోరీ కేసులో పోలీసులు ఊహించని ట్విస్ట్ బయటపెట్టారు.

సినిమాను మించిన ట్విస్ట్.. 15 కిలోల బంగారం దోచేసిన సోషల్ మీడియా స్టార్స్.. ఎలా చిక్కారంటే..?
Youtuber And Instagram Influencer Behind 15 Kg Gold Heist

Updated on: Nov 14, 2026 | 4:54 PM

సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న ఒక యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కలిసి భారీ చోరీకి తెగబడ్డారు. తమిళనాడులోని మదురైలో సంచలనం సృష్టించిన ప్రముఖ నగల దుకాణం దోపిడీ కేసులో పోలీసులు ఊహించని నిజాలను బయటపెట్టారు. సినిమా ఫక్కీలో పక్కా ప్లాన్‌తో 15 కిలోల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లిన ఈ ముఠా గుట్టును ప్రత్యేక బృందాలు రట్టు చేశాయి. మదురై జిల్లా కలవాసల్ ప్రధాన రహదారిపై ఇటీవల ప్రారంభమైన ప్రసిద్ధ తనిష్క్ నగల దుకాణంలో నవంబర్ 12న భారీ దోపిడీ జరిగింది. నల్లటి దుస్తులు, ముసుగులు ధరించిన దుండగులు షోరూమ్ వెనుక వైపు ఉన్న ఇనుప కడ్డీల మీదుగా ఎక్కి, ఏకంగా గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. షోకేస్‌లలో భద్రపరిచిన దాదాపు 15 కిలోల బంగారు, వజ్రాల ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

యజమాని అనుమానంతో కదిలిన డొంక

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇదే సమయంలో పలవంతంగల్ ప్రాంతానికి చెందిన సురేష్ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని షోరూమ్ యజమాని పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి సురేష్‌తో పాటు మదురై తిరుప్పాలై ప్రాంతానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 5 కిలోల బంగారు, వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

15 రోజుల పాటు రెక్కీ.. కస్టమర్లలా నటించి

అరెస్టయిన సురేష్, మీనాక్షిలను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దోపిడీ వెనుక సురేష్ కుమారుడు, ప్రముఖ యూట్యూబర్ నిశాంత్ ప్రధాన సూత్రధారి అని తేలింది. కొత్తగా ప్రారంభమైన ఈ షోరూమ్‌లోకి నిశాంత్, అతని అనుచరులు గత 15 రోజులుగా నగలు కొనే కస్టమర్ల మాదిరిగా వస్తూ రెక్కీ నిర్వహించారు. విలువైన నగలు ఎక్కడ పెడుతున్నారు..? సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? లోపలికి సులభంగా ఎలా ప్రవేశించాలి..? అనే విషయాలను సిబ్బంది మాటల ద్వారా, తమ పరిశీలన ద్వారా పక్కాగా తెలుసుకున్నారు.

పరారీలో యూట్యూబర్ నిశాంత్

పక్కా స్కెచ్ ప్రకారం దోపిడీ పూర్తి చేసిన తర్వాత, నిశాంత్ ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ మీనాక్షిని సంప్రదించి చోరీ సొత్తును దాచేందుకు సహాయం తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడైన యూట్యూబర్ నిశాంత్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు, మిగిలిన 10 కిలోల బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సోషల్ మీడియా స్టార్స్ ఇలా దోపిడీలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us