
ఉత్తరాఖండ్‌లో ఓ వింత, విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిపై నల్ల పాము దాడికి యత్నించింది. అయితే పాము కాటు వేయకపోయినా ఆ యువకుడు కొద్దిసేపటికే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. పాము విషం ఎక్కకుండానే అతను ఎలా మరణించాడనే విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా బిసల్‌పూర్ ప్రాంతానికి చెందిన రాహుల్ కశ్యప్ అనే యువకుడు ఉత్తరాఖండ్‌లోని కిచ్చాలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతను విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక నల్ల పాము అతని కాలు వద్దకు వచ్చి దాడికి యత్నించింది.
పాము తనపైకి రావడంతో రాహుల్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తనను తాను రక్షించుకోవడానికి పక్కనే ఉన్న ఒక ఇటుక తీసుకుని ఆ పాముపై విసిరాడు. దీంతో ఆ నల్ల పాము అక్కడి నుండి పారిపోయింది. పాము వెళ్లిపోవడంతో రాహుల్‌తో పాటు అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము వెళ్లిపోయిన కొద్దిసేపటికే రాహుల్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అతను తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయి నేలపై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే రాహుల్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు.
రాహుల్ మృతిపై వైద్యులు వెల్లడించిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాహుల్ శరీరంపై ఎలాంటి పాము కాటు ఆనవాళ్లు లేవని, అతను పాము విషం వల్ల చనిపోలేదని వైద్యులు స్పష్టం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాము కాటు వేయకపోయినా రాహుల్ ఎలా చనిపోయాడనే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపింది.
పాము కాలుపై దాడికి యత్నించిన సమయంలో రాహుల్ తీవ్ర భయానికి లోనయ్యాడని స్థానికులు చెబుతున్నారు. ఆ ఆకస్మిక భయం వల్ల అతని హృదయ స్పందన రేటు విపరీతంగా పెరిగి, గుండెపోటు రావడంతోనే మరణించి ఉండవచ్చని అంతా అనుమానిస్తున్నారు. రాహుల్ మృతదేహాన్ని స్వగ్రామమైన బిసల్‌పూర్‌కు తరలించగా, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.