INDIA Politics: మిగిలేదెవరు? కొత్తగా వచ్చేదెవరు?.. ఇండియా కూటమిలో లుకలుకలు.. బీజేపీకి బలాన్నిస్తాయా?

|

Jan 28, 2024 | 6:50 PM

యుద్ధానికి ముందే అస్త్రాలను కోల్పోతున్నట్టుగా తయారవుతోంది కాంగ్రెస్‌ కూటమి పరిస్థితి. ఇప్పటికే సొంత రాష్ట్రాల్లో ఆప్‌, తృణముల్‌ కాంగ్రెస్‌లు షాక్‌ ఇవ్వగా... తాజాగా ఇండియాకూటమిలో మరో కీలక వికెట్‌ పడింది. దీంతో ఎన్నికల నాటికి.. కూటమి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది.

ఈసారి బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీకి.. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 26 పార్టీలతో ఏర్పాటు చేసిన ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ అలయెన్స్‌ కూటమి.. ఒకడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. పాట్నాలో తొలి సమావేశం, బెంగళూరులో రెండో సమావేశం.. ముంబై వేదికగా మూడో సమావేశం నిర్వహించుకున్న కూటమి.. రాబోయే సార్వత్రిక ఎన్నికలపై గట్టిగానే ఫోకస్‌ పెట్టింది. ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది.

అయితే, ఇటీవల కూటమిలో జరుగుతున్న పరిణామాలు.. కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌… పంజాబ్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ… తమ రాష్ట్రాల పరిధిలో పార్లమెంట్‌ ఎన్నికలకు ఒంటరిగానే బరిలో నిలుస్తామని ప్రకటించడం కలకలం సృష్టించింది. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే.. మొదట్నుంచీ కీలకంగా వ్యవహరించిన జేడీయూ సైతం.. తాజాగా ఇండియా కూటమికి కటీఫ్‌ చెప్పేసింది. కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కలిసి బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన నితీష్‌కుమార్‌.. అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామా చేసి కూటమికి పెద్ద షాక్‌ ఇచ్చారు.

నిజానికి, ఈ కూటమి ఏర్పాటుకోసం అందరినీ ఏకచేసిన నాయకుడు నితీష్‌ కుమార్‌. అందుకు తగ్గట్టే ఫస్ట్‌ మీటింగ్‌ పాట్నాలో ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేశారు. అయితే, కూటమిని ఆ తర్వాత కాంగ్రెస్‌ హైజాక్‌ చేసిందనే ఫీలింగ్‌ వచ్చేసింది. అలాగని, కూటమి తరపున కాంగ్రెస్‌ యాక్టివ్‌గా చేపట్టిన కార్యక్రమాలూ లేవు. సడెన్‌గా తనకు ప్రయారిటీ తగ్గించడం కూడా నితీశ్‌ను బాధించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అయోధ్య రామమందిర నిర్మాణం, బీహార్‌ మాజీ సీఎం కర్పూర్‌ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వడం వంటి పరిణామాలు.. నితీష్‌ను మళ్లీ బీజేపీ వైపు మళ్లేలా చేశాయి. అయితే నితీష్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది కాంగ్రెస్‌..

ఇప్పటికే రెండు కీలక పార్టీలు తమ రాష్ట్రాల్లో కూటమిని పక్కనబెట్టడంతో షాక్‌లో ఉన్న కాంగ్రెస్‌కు.. నితీష్‌ నిర్ణయం మరింత ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే.. కూటమిలో ఈ లుకలుకలు బీజేపీకి మరింత బలాన్నిస్తాయా? అనే చర్చ కూడా నడుస్తోంది. మున్ముందు కాంగ్రెస్‌ కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో! పార్లమెంటు ఎన్నికల్లో ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందో! చూడాలి మరి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..