
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాల సాధనను ఉద్దేశించి వియ్ విల్ డూ ఇట్ అంటూ బలమైన సంకల్పంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వికసిత్ భారత్-2047.. వియ్ విల్ డూ ఇట్, టాప్-3 ఎకానమీ.. వియ్ విల్ డూ ఇట్, ఆత్మనిర్భర్ భారత్.. వియ్ విల్ డూ ఇట్, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్.. వియ్ విల్ డూ ఇట్, ఒలింపిక్ డ్రీమ్.. వియ్ విల్ డూ ఇట్, అంతరిక్షంలో అడుగు.. వియ్ విల్ డూ ఇట్ అంటూ దేశ ఆకాంక్షలను సభ వేదికగా పునరుద్ఘాటించారు.
ప్రజాసేవలోనే పాతికేళ్లు..
అలాగే తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశాను. దేశ ప్రజల సేవలోనే ఈ పాతికేళ్లు గడిచిపోయాయి. ప్రజల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైంది అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. తన సేవా యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని, ప్రజా ఆశీర్వాద బలమే తనను ఇంతకాలం నడిపించిందని స్పష్టం చేశారు.
ఎప్పటికీ విద్యార్థినే..
జీవితంలో నిత్యం నేర్చుకోవడంలో తాను ఎప్పటికీ ఒక విద్యార్థినేనని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికలు ఏవైనా సరే దేశ ప్రజలు తనపై తిరుగులేని విశ్వాసం చూపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశం నాకు ఎంతో ఇచ్చింది.. దేశ ప్రయోజనాలే నా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు. ఇదే వేదికపై నుంచి తమ ప్రభుత్వ ప్రయాణంలో కలిసి నడుస్తున్న ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.