Wayanad landslides: వయనాడ్‌ విలయానికి కారణమేంటో చెప్పిన లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ రీసెర్చ్‌

|

Aug 04, 2024 | 5:16 PM

వయనాడులో వరుసగా ఆరోరోజు సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆదివారం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. గల్లంతైన 206 మంది కోసం అణువణువు గాలిస్తున్నారు. కేంద్రమంత్రి సురేశ్‌ గోపి సహాయక చర్యలను పర్యవేక్షించారు

Wayanad landslides: వయనాడ్‌ విలయానికి కారణమేంటో చెప్పిన లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ రీసెర్చ్‌
Landslides
Follow us on

వరదల విలయంతో వణికిపోయిన కేరళ వయనాడ్‌లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 361 మృతదేహాల వెలికితీశారు. ఆదివారం మరో నాలుగు మృతదేహాలు దొరికాయి. 206 మందికి పైగా స్థానికులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ ఇంకా చిక్కడం లేదు. 11వందల మందిని రక్షించాయి రెస్క్యూ టీమ్స్. 200మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి సురేష్ గోపి పర్యటించారు. సహాయ చర్యలు పర్యవేక్షించారు.

రిలీఫ్‌ క్యాంప్‌లో ఉన్న వాళ్లందరికీ కౌన్సెలింగ్‌

రిలీఫ్‌ క్యాంప్‌లో ఉన్న ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. రిలీఫ్‌ క్యాంప్‌లో ఉన్న వాళ్లందరికి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామన్నారు కేంద్రమంత్రి సురేశ్‌ గోపి.

“బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. రిలీఫ్‌ సెంటర్లలో ఉన్న వాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్లందరికి కౌన్సెలింగ్‌ ఇస్తాం.. వీలైనంత త్వరగా పునరావాసం కల్పిస్తాం. సామాజిక కార్యకర్తలు , స్వచ్చంధ సంస్థలు , సైకాలిజస్ట్‌ల సాయం తీసుకుంటాం. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది” అని ఆయన తెలిపారు

వరద ప్రభావిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన చోట.. అడ్వాన్స్ రాడార్స్, డ్రోన్స్, హెవీ మిషన్స్ ఉపయోగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. చలియార్ నదీ తీరంలో 40 కిలోమీటర్ల మేర సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మలప్పురంలోని నీలాంబర్ ప్రాంతంలో చాలా మృతదేహాలు దొరికాయి. చలియార్ రివర్‌లో 73 మృతదేహాలు, 132 బాడీ పార్ట్స్ గుర్తించారు. దొరికిన మృతదేహాల్లో 37 పురుషులు, 29 మహిళలు, ముగ్గురు బాలురు, 4 బాలికలు ఉన్నారన్నారు మలప్పురం అధికారులు.

NDRF, K-9 డాగ్ స్క్వాడ్, ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్, పోలీసులు, అటవీ, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని తాళ్ల సాయంతో కిందకు తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా కొండల్లో చిక్కుకున్నారా అని.. డ్రోన్స్ సాయంతో వెతుకుతున్నారు. మరోవైపు.. ఇళ్ల చుట్టూ చేరిన వరద, చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు సహాయక సిబ్బంది.

వయనాడు విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ డిమాండ్

వయనాడు విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్‌గాంధీ డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం జాతీయ విపత్తు అన్న అంశం లేదన్నారు మాజీ కేంద్రమంత్రి మురళీధరన్‌. వయనాడు జిల్లాలో మొత్తం 1208 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముండక్కాయ్‌లో 540 ఇళ్లు చూరాల్‌మాలలో 600 ఇళ్లు , అట్టామాలలో 60 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3700 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు గుర్తించారు. రూ.21 కోట్ల మేర పంటనష్టం జరిగింది. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మొత్తం 49 మంది చిన్నారులు గల్లంతుకావడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

వయనాడు బాధితులకు తమ నెల జీతం సాయంగా ప్రకటించారు UDF ఎమ్మెల్యేలు. చిరంజీవి , రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్‌ కూడా సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.25 లక్షల చెక్‌ను పంపించారు. త్వరలో వయనాడులో డ్రోన్‌ సర్వే నిర్వహిస్తారు. కూలిన ఇళ్లను గుర్తించేందుకు డ్రోన్‌ సర్వే చేపడుతున్నారు. పాత ఫోటోల ఆధారంగా ఈ సర్వే జరుగుతుంది.

వయనాడు ప్రజలకు మరో కష్టం ఎదురయ్యింది. విలయ జరిగిన ప్రదేశంలో దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జనం లేని ఇళ్లలో దొంగలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలంటూ కోరుతున్నారు. దీంతో విలయ ప్రాంతాలలో పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో బాధిత ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, ఇతర కారణాలతో ఇళ్లలోకి ప్రవేశించడానికి వీలులేదని స్పష్టం చేశారు. కొండచరియలు విరిగిపడడంతో భద్రత కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు పగలగొట్టి ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు.

వయనాడ్‌ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించిందనీ.. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్‌ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయిందని తెలిపింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.