
తమిళ రాజకీయాల్లో గత ఐదు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక ఆధిపత్యానికి దళపతి విజయ్ తెరదించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో బరిలోకి దిగిన ఆయన, మొదటి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్లకు కేవలం 10 అడుగుల దూరంలో విజయ్ ఆగిపోవడంతో ఇప్పుడు పొత్తుల పర్వం మొదలైంది.
తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ తమ మద్దతు కోరినట్లు స్పష్టమైంది. “తమిళనాడులో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయ్ ప్రతిపాదనపై అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది” అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, విజయ్ వైపు మొగ్గు చూపితే తమిళనాట సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కావడం ఖాయం.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఈ విజయ ప్రభంజనాన్ని సూచిస్తోంది. విజయ్ కేవలం తన క్రేజ్‌తోనే కాకుండా, పక్కా మేనిఫెస్టో, యువత మద్దతుతో డీఎంకే కంచుకోటలను బద్దలు కొట్టారు. అటు పీఎంకే(PMK), లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం కూడా టీవీకే చర్చలు జరుపుతోంది.
ఒకవేళ కాంగ్రెస్ తన 5 సీట్లతో విజయ్‌కు మద్దతు ఇస్తే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మే 7వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల తర్వాత ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి అద్భుత విజయం సాధించడం తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.