Transgender: న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టిన ట్రాన్స్‌జెండర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

|

Jan 02, 2024 | 3:49 PM

లింగ వివక్ష కారణంగా ఉద్యోగం విషయంలో తనకు జరిగిన అన్యాయంపై ఓ ట్రాన్స్‌జెండర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత చదువులు చదువుకున్న ఓ ట్రాన్స్‌జెండర్.. ముందుగా గుజరాత్, ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగం సాధించింది.

Transgender: న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టిన ట్రాన్స్‌జెండర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Supreme Court
Follow us on

లింగ వివక్ష కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ ట్రాన్స్‌జెండర్ న్యాయం కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానం – సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత చదువులు చదువుకున్న ఆ ట్రాన్స్‌జెండర్.. ముందుగా గుజరాత్, ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగం సాధించింది. అయితే ఆమె మహిళ కాదు ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో ఆ రెండు స్కూల్ యాజమాన్యాలు టీచర్ ఉద్యోగం నుంచి తొలగించాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ ట్రాన్స్‌జెండర్ దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. ట్రాన్స్‌జెండర్ ముందుగా యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. ఆమెకు అపాయింట్‌మెంట్ లెట‌ర్ కూడా ఆ పాఠశాల యాజమాన్యం జారీ చేసింది. ఆరు రోజుల త‌ర్వాత ఆమె మహిళ కాదు.. ట్రాన్స్‌జెండ‌ర్ అని తెలియడంతో విధుల నుంచి తొల‌గించారు. ఇక గుజ‌రాత్ స్కూల్‌లో కూడా ఇదే తరహా చేదు అనుభవం ఎదురయ్యింది. టీచర్‌గా అపాయింట్‌మెంట్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం.. ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో విధుల్లో చేర్చుకునేందుకు నిరాకరించింది. దీనిపై రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో సదరు ట్రాన్స్‌జెండర్ పిటిషన్ దాఖలు చేసింది. రెండు వేర్వేరు హైకోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లను ఒకటిగా చేర్చి విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లింగ వివక్ష కారణంగా తాను ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని.. ఈ విషయంలో తన ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ట్రాన్స్‌జెండర్ కోరింది. టీచర్‌గా పనిచేసేందుకు అవసరమైన అర్హతలు తనకు ఉన్నా.. లింగ ప్రాతిపధికన తనను ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తంచేసింది.

ఈ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్రచూడ్, జ‌స్టిస్ జేబీ పార్దివ్లా, జ‌స్టిస్ మ‌నోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచార‌ణ‌కు స్వీక‌రించింది. ట్రాన్స్‌జెండర్ పిటిషన్‌పై కేంద్రం, గుజ‌రాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే గుజ‌రాత్‌ జామ్‌న‌గ‌ర్‌లోని పాఠ‌శాల‌కు, యూపీ ఖిరిలోని ప్రైవేటు పాఠ‌శాల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో తాము ఏమి చేయగలమో చూస్తామని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.

ట్రాన్స్‌జెండర్‌లను మూడో లింగంగా పరిగణించాలని.. విద్య, ఉద్యోగం విషయంలో లింగం కారణంగా వారికి సమాన హక్కులు నిరాకరించరాదని సుప్రీంకోర్టు 2014లో ఓ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు విచారణకు వచ్చిన అదే తరహా కేసులో సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పు ఇవ్వనుందన్నది ఆసక్తికరంగా మారింది.