
రాత్రి 11 గంటల సమయం, బయట జోరున వాన కురుస్తోంది. తడిసిముద్దయిన రెయిన్‌కోట్ వేసుకున్న ఓ యువకుడు ఇంటి తలుపు దగ్గర నిలబడి, పసిపాపను ఎత్తుకున్నంత జాగ్రత్తగా వేడివేడి ఆహార పొట్లాన్ని చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. ‘‘గుడ్ ఈవెనింగ్ సార్.. దయచేసి నాకు రేటింగ్ ఇవ్వండి’’ అని చెప్పి, లిఫ్ట్ తలుపు మూసుకోకముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మన నిత్యజీవితంలో ఇలాంటి డెలివరీ బాయ్స్‌ను ఎంతోమందిని చూస్తుంటాం. కానీ ఆ యాప్‌ల దృష్టిలో అతను ఒక ఉద్యోగి కాదు.. కేవలం ఒక పార్ట్‌నర్ మాత్రమే.. యాప్‌లు తెచ్చిన మొదటి మార్పు డిక్షనరీలోనే మొదలైంది. సాధారణ ఉద్యోగికి ఉండే నెలవారీ జీతం, సెలవులు, పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి ఏ భద్రతా ఈ గిగ్ వర్కర్లకు ఉండదు. ప్రతి ఆర్డర్‌కు లేదా రైడ్‌కు ఇంతని కమీషన్ మాత్రమే అందుతుంది. బండి పెట్రోల్ ఖర్చులు, రిపేర్లు, ఫోన్ బిల్లు అన్నీ వారి సొంత జేబు నుంచే పెట్టుకోవాలి. పేరుకు పార్ట్‌నర్ అని పిలుస్తున్నా.. చెల్లింపులు, వెళ్లాల్సిన రూట్, రేటింగ్ అన్నీ యాప్ చేతిలోనే ఉంటాయి. తక్కువ రేటింగ్ పడితే చాలు, మరుసటి రోజు వారికి వచ్చే ఆర్డర్లు ఆగిపోతాయి.
నీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం.. 2020-21 నాటికి దేశంలో సుమారు 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉండగా, 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు చేరుతుందని అంచనా. ఎలాంటి ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్లు లేకుండా కేవలం ఒక బైక్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు రోజుల్లోనే సంపాదన మొదలుపెట్టవచ్చు. గ్రామాల్లో ఉపాధి లేక నగరాలకు వచ్చే యువతకు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పార్ట్-టైమ్ పని చేయాలనుకునే వారికి ఇది తక్షణ ఉపాధినిస్తోంది. అనారోగ్యం పాలైతే ఆ రోజు సంపాదన ఆగిపోతుంది. రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చులు వారే భరించాలి.
కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు తొలిసారిగా చట్టపరమైన గుర్తింపు లభించింది. వీరికి ఆరోగ్య, ప్రమాద బీమా, వృద్ధాప్య భద్రత కల్పించేందుకు కంపెనీలు తమ టర్నోవర్‌లో కొంత భాగాన్ని సంక్షేమ నిధికి జమ చేయాలని ఈ చట్టం చెబుతోంది. రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక చట్టాలు కూడా చేశాయి.
అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఇ-శ్రమ్ పోర్టల్‌లో ఆగస్టు 3, 2025 నాటికి 30.9 కోట్ల మందికి పైగా నమోదు చేసుకోగా, అందులో ప్లాట్‌ఫామ్ వర్కర్లు కేవలం 3.37 లక్షల మంది మాత్రమే ఉన్నారు. దేశంలోని 77 లక్షల మంది గిగ్ వర్కర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఆర్డర్ల మధ్య తీరిక లేకపోవడం, పోర్టల్‌పై అవగాహన లేకపోవడం, ప్రశ్నిస్తే ఎక్కడ తమ ఐడీ బ్లాక్ అవుతుందోనన్న భయం వారిని వెనక్కి లాగుతున్నాయి.
గిగ్ వర్కర్లను పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తే ఖర్చులు పెరిగి, ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని కంపెనీలు వాదిస్తున్నాయి. మరోవైపు జీతం నుంచి రూట్ వరకు అన్నీ యాప్ నియంత్రణలో ఉన్నప్పుడు వారు స్వతంత్రులు ఎలా అవుతారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మనం ఫోన్ స్క్రీన్‌పై ఒక్క సెకనులో నొక్కే ఐదు నక్షత్రాల రేటింగ్, రేపు ఆ డెలివరీ బాయ్ ఇంటికి ఎంత డబ్బు తీసుకెళ్తాడో నిర్ణయిస్తుంది. వర్షంలో తడుస్తూ మన ఇంటి తలుపు తట్టే ఆ వ్యక్తి జీవితానికి భద్రత కల్పించే బాధ్యత ఎవరిదన్నదే నేడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న.