వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళితే చాలు..టీకా తీసుకున్నట్లే! కన్ఫ్యూజ్‌ కావొద్దు..ఇదీ విషయం

|

May 02, 2021 | 2:03 PM

అదేంటీ వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళితే..కరోనా టీకా తీసుకున్నట్లే ఎలా అవుతుంది అనుకుంటున్నారా..? కోవిడ్‌ టీకా అంటే, సూది మందు..ఇంజెక్షన్‌ తీసుకోకుండా ఎలా తీసుకున్నట్లు అవుతుంది...

వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళితే చాలు..టీకా తీసుకున్నట్లే! కన్ఫ్యూజ్‌ కావొద్దు..ఇదీ విషయం
Kanigiri Constituency
Follow us on

అదేంటీ వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళితే..కరోనా టీకా తీసుకున్నట్లే ఎలా అవుతుంది అనుకుంటున్నారా..? కోవిడ్‌ టీకా అంటే, సూది మందు..ఇంజెక్షన్‌ తీసుకోకుండా ఎలా తీసుకున్నట్లు అవుతుంది…కన్ఫ్యూజ్‌ కావొద్దు అని చెబుతూనే…మళ్లీ కన్ఫ్యూజ్‌ చేస్తున్నారేంటీ అనుకుంటున్నారు..కదూ…కానీ, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజలు ఇప్పుడు ఇదే గందరగోళంలో పడ్డారు. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లా లేక వేసుకోనట్లా అనే అనుమానం తలెత్తేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో రోజు…రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు గానూ ప్రజలు రోజూ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ కొరకు సెంటర్ల వద్ద పడిగాపులు పడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఏప్రిల్ నెల 29న ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోగా 30వ తేదీ 11.00 గంటలకు టైమ్‌ ఇచ్చారు. ఇలా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వ్యాక్సిన్ కేంద్రంతో పాటు తేదీ, సమయం వారికి మెసేజ్ రూపంలో వచ్చింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఆన్‌లైన్‌లో ఇచ్చిన ప్రకారం వ్యాక్సిన్ కేంద్రాలకు వెళితే అక్కడ వ్యాక్సిన్ అందుబాటులో లేదంటున్నారు వైద్యాధికారులు. చేసేదేమీ లేక వెనుదిరిగారు చాలామంది స్థానికులు. అయితే, 30వ తేదీ సాయంత్రానికి వారు వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా మెసేజ్ వచ్చింది. అంతేకాదు, మెసేజ్‌తో పాటు సర్టిఫికెట్ కూడా వారికి రావడం జరిగింది. ఇది చూసి వారంతా ఖంగుతున్నారు. అసలు వ్యాక్సిన్ వేసుకోకుండానే వేసుకున్నట్లు వారి పేరుతో సర్టిఫికెట్ రావడంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

ఇలా సర్టిఫికెట్ రావడంతో తిరిగి వారు వ్యాక్సిన్ కోసం వెళ్తే వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా చూపిస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. అధికారులు స్పందించి వ్యాక్సిన్ వేయాలి లేదా ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతున్నారు.