Tamil Nadu Politics: తమిళనాడులో రెండాకులతో బీజేపీ విడాకులు..!

| Edited By: Balaraju Goud

Feb 01, 2022 | 5:25 PM

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్టుగానే రాజకీయ పార్టీల మధ్య బంధాలు, అనుబంధాలు శాశ్వతంగా ఉండవు. కాసేపు కలిసుంటాయి. కాసేపు కలియబడతాయి. ఆ కలిసుండడాలు, విడిపోవడాలు అవసరార్థం కోసమే!

Tamil Nadu Politics: తమిళనాడులో రెండాకులతో బీజేపీ విడాకులు..!
Tamil Nadu Aiadmk Bjp
Follow us on

No deal with AIADMK, BJP: రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్టుగానే రాజకీయ పార్టీ(Political Parties)ల మధ్య బంధాలు, అనుబంధాలు శాశ్వతంగా ఉండవు. కాసేపు కలిసుంటాయి. కాసేపు కలియబడతాయి. ఆ కలిసుండడాలు, విడిపోవడాలు అవసరార్థం కోసమే! తమిళనాడులో అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) మధ్య అనుబంధం కూడా ఇలాంటిదే! మొన్నటి వరకు కలిసున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు తాత్కాలిక విడాకులు తీసుకున్నాయి. అంటే పూర్తిగా తెగతెంపులు కాకుండా కొంతకాలం పాటన్న మాట! అది కూడా స్థానిక ఎన్నికల వరకు.. ఇది కూడా కేవలం తమిళనాడు వరకే.. జాతీయ స్థాయిలో మాత్రం ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే ఉంటుంది..అదే చిత్రం!

ఈ నెల 19న తమిళనాడులో నగరపాలక ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉంది. విజయంపై డీఎంకే కొండంత ఆత్మ విశ్వాసంతో ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా అధికారపార్టీకి ఆత్మవిశ్వాసాన్ని దెబ్భ తీయాలన్నది అన్నాడీఎంక ఆలోచన! ఈ ఎన్నికల్లో ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఇలాంటి విషయాలపై చాలా రోజులుగా అన్నాడీఎంకే కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. అవి ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య కూడా సీట్ల పంపకంపై చర్చలు జరిగాయి కానీ రెండు పార్టీలు ఏకగ్రీవానికి రాలేకపోయాయి.

అసలు అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఈ రెండు పార్టీ మధ్య అంతరాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. ప్రభుత్వం వ్యతిరేకంగా జరిగిన ధర్నాలు, ఆందోళనలు కూడా కలిసి చేయలేదు. మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో పగుళ్లు ఎక్కువవుతున్నాయి. ఇంతకు ముందే డీఎండీకే, పీఎంకేలు తమ దారి తాము చూసుకున్నాయి. ఇప్పుడు బీజేపీ బయటకు వెళ్లింది. ఇక మిగిలింది తమిళ మానిల కాంగ్రెస్‌ మాత్రమే మిగిలి ఉంది. అన్నా డీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీర్‌ సెల్వం, కో కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చర్చలు జరిపినా ఫలించలేదు. రాష్ట్రంలో తమ బలం పెరిగిందని, కనీసం 30 శాతం సీట్లయినా ఇవ్వాలని బీజేపీ పట్టుపట్టింది.

కమలంపార్టీకి అంత సీన్‌ లేదని, ఇస్తే గిస్తే అయిదు శాతం సీట్లు మాత్రమే ఇస్తామని అన్నాడీఎంకే తెగేసి చెప్పింది. అయినా బీజేపీ బేరసారాలు వదల్లేదు. కనీసం 18 శాతం సీట్లయినా ఇవ్వండని కోరింది. అబ్బే కుదరదు.. ఎనిమిది శాతం ఇస్తాము .. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వెళ్లిపోండి అని అన్నాడీఎంకే గట్టిగా చెప్పేసింది. మళ్లీ ఏమనుకుందో ఏమో కానీ…ఓ 11 శాతం వరకైతే ఇవ్వగలమని బీజేపీకి కబురుపంపింది అన్నాడీఎంకే. ఎప్పుడైతే అన్నాడీఎంకే కాసింత మెట్టు దిగిందో అప్పుడు బీజేపీ పంతం పట్టింది.. 18 శాతం కంటే ఒక్క శాతం కూడా తగ్గేది లేదనని ఖరాకండీగా చెప్పేసింది. ఇలా ఓవైపు బేరసారాలు ఇంకా పూర్తి కాకముందే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ప్రకటించింది. ఇది బీజేపీకి మండించింది.

అదే సమయంలో బీజేపీతో చర్చలు ముగిసినట్టేనని ప్రత్యక్షంగా చెప్పకుండా పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు. అన్నాడీఎంకే నుంచి పిలుపు వస్తుందేమోనని బీజేపీ నిన్నటి వరకు ఎదురుచూసింది.. రాకపోయే సరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగానే రిలో దిగుతామని బీజేపీ ప్రకటించింది. తాము అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి అన్నాడీఎంకే అంగీకరించకపోవడంతో ఇక ఆ పార్టీతో అంటకాగడం అనవసరమని భావిస్తున్నామని తమిళనాడు బీజేపీ ప్రకటించింది. అయితే ఎన్డీయే కూటమిలో మాత్రం అన్నాడీఎంకే ఉంటుందని తెలిపింది.

అలాగని డీఎంకే కూటమిలో ఎలాంటి ఇబ్బందులు పొరపొచ్చాలు లేవని కాదు.. అక్కడా ఉన్నాయి. కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటోంది డీఎంకే. మరోవైపు డీఎండీకే కూడా ఒంటరిగానే బరిలో దిగుతోంది..

Read Also…. Ashok Gehlot on Budget: కేంద్ర బడ్జెట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి చురకలు.. ఇంతకీ ఏమన్నారంటే?