రాసిపెట్టుకోండి.. మమత సర్కారు నాటికల్లా కూలిపోతుంది.. BJP నేత సంచలన వ్యాఖ్యలు

|

Aug 10, 2022 | 11:15 AM

తృణముల్ కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారంటూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి.. ఇప్పుడు మమత సర్కారు మనగడపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

రాసిపెట్టుకోండి.. మమత సర్కారు నాటికల్లా కూలిపోతుంది.. BJP నేత సంచలన వ్యాఖ్యలు
West Bengal CM Mamata Banerjee (File Photo)
Follow us on

West Bengal Politics: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కారు త్వరలోనే కూలిపోవడం తథ్యమట. ఆ రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి ఘంటాపథంగా చెబుతున్న మాట ఇది. తన మాట నిజమవుతుందని.. కావాలంటే రాసిపెట్టుకోండని ఆయన తేల్చిచెబుతున్నారు. మమత సర్కారు ఎప్పటిలోగా కూలిపోతుందో డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. డిసెంబరు నాటికల్లా టీఎంసీ అధికారాన్ని కోల్పోతుందని ఆయన జోస్యం చెప్పారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారంటూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు మమత సర్కారు మనగడపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

తృణముల్ కాంగ్రెస్ సర్కారును ఇంటికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని మాసాలు తర్వాత అంతా మీరే చూస్తారు.. రాసిపెట్టుకోండి.. డిసెంబర్ నెల తర్వాత టీఎంసీ అధికారంలో ఉండదంటూ మీడియా ప్రతినిధులనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సువేందు.. ఈ సంచలన కామెంట్స్ చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితులే పునరావృతం అవుతాయంటూ గత కొన్ని రోజులుగా సువేందు పదేపదే చెబుతున్నారు.

అయితే రాజకీయ అసహనంతోనే సువేందు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ముందే చెప్పగల నేర్పరి అయితే.. బీహార్‌ పరిణామాలను ముందుగానే ఎందుకు అంచనావేయలేకపోయారని ఆమె ప్రశ్నించారు. సువేందు అధికారి కొత్తగా జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టారంటూ సెటైర్లు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ సర్కారును కూల్చేందుకు బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేసినా.. ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతామని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి