
ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయి, 48 గంటలకు మించి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయకుండానే అతడు ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుకు ప్రత్యేకంగా సస్పెన్షన్ ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. బీహార్‌లో లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌కు బెయిల్ పునరుద్ధరిస్తూ నవంబర్ 6న ఇచ్చిన ఉత్తర్వుల్లో ధర్మాసనం ఈ విషయాన్ని వెల్లడించింది.
రూ.4 వేల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు
బీహార్‌లోని సమస్తిపూర్ సదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న విశ్వజీత్ సింగ్‌పై లంచం ఆరోపణలు వచ్చాయి. ఓ కాంట్రాక్ట్ కార్మికుడికి చెల్లించాల్సిన రూ.36,421 బకాయి వేతనాలను విడుదల చేసేందుకు రూ.4,000 లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ వ్యవహారంపై 2025లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7(బి) కింద విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విశ్వజీత్ సింగ్‌ను అరెస్టు చేశారు.
బెయిల్ రద్దు చేసిన పాట్నా హైకోర్టు
అరెస్టు అనంతరం సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఫిర్యాదుదారుడు ఈ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టులో సవాలు చేయడంతో, 2026 జూలై 1న హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో విశ్వజీత్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
బెయిల్ రద్దు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
బెయిల్ మంజూరు సమయంలో లంచం మొత్తం తక్కువగా ఉందని సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని ధర్మాసనం గుర్తించింది. అయితే కేవలం లంచం మొత్తం ఆధారంగా బెయిల్‌ను రద్దు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. నేర తీవ్రత, విధించగల శిక్ష, నిందితుడి నేర చరిత్ర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది.
అదే ఆసుపత్రిలో తిరిగి పోస్టింగ్‌పై ఆగ్రహం
ఈ కేసులో మరో కీలక అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. విశ్వజీత్ సింగ్ అరెస్టయిన తర్వాత సుమారు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని పేర్కొంది. 48 గంటలు దాటినందున అప్పటికే ఆయన డీమ్డ్ సస్పెన్షన్‌లో ఉన్నట్లేనని స్పష్టం చేసింది. అయితే ఆయన సస్పెన్షన్‌ను తర్వాత రద్దు చేసి, తిరిగి అదే ఆసుపత్రిలో అదే పోస్టులో నియమించడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారాన్ని బీహార్ ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిశీలించి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో విశ్వజీత్ సింగ్‌కు బెయిల్‌ను పునరుద్ధరిస్తూ పాట్నా హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు సర్వీస్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..