ప్రాణాలను పణంగా పెట్టి 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ చేతిలో కత్తిపోటుకు గురైన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులో ఉంచుతూ విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కీలకంగా వ్యవహరించారు.

ప్రాణాలను పణంగా పెట్టి 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు!
Pm Modi Praises Indian Pilot Smit Machchhar

Updated on: Oct 01, 2026 | 12:05 PM

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ చేతిలో కత్తిపోటుకు గురైన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులో ఉంచుతూ విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కీలకంగా వ్యవహరించారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం (అక్టోబర్ 01) ఉదయం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్న ప్రధాని.. కెప్టెన్ స్మిత్ మచార్‌ను హీరోగా అభివర్ణించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినా, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, అచంచలమైన సంకల్పం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన శౌర్యం వందలాది ప్రాణాలను కాపాడి, పెద్ద విషాదాన్ని నివారించిందని అన్నారు. కెప్టెన్ మచార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా కెప్టెన్ మచార్ సాహసాన్ని ప్రశంసించారు. కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడినప్పటికీ దాడి చేసిన వ్యక్తిని ప్రతిఘటించి, కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు సహకరించారని తెలిపారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో గగనతలంలో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనలో 174 మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ మచార్ నిజమైన హీరో అని కొనియాడారు.

ఎవరీ ప్టెన్ స్మిత్ మచ్ఛర్..?

ఫ్లై దుబాయ్‌కి చెందిన ఫ్లైట్ FZ1073లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనతో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ పేరు అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కాక్‌పిట్‌లో జరిగిన ఘటనలో మచ్ఛర్ గాయపడ్డారు. పరిస్థితుల నేపథ్యంలో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

గుజరాత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం ముంబైలో కుటుంబంతో స్థిరపడ్డారు. ఆయన కుటుంబం భారత్‌లోనే నివసిస్తోంది. ఆయన సోదరుడు కూడా విమానయాన రంగంలో పనిచేస్తూ అకాసా ఎయిర్‌లో పైలట్‌గా ఉన్నారు. ఈ ఘటన అనంతరం సౌదీ అరేబియా, యూఏఈలోని భారత రాయబారులు మచ్ఛర్ కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

మచ్ఛర్‌కు కమర్షియల్ విమానయానంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఫ్లైదుబాయ్‌లో చేరకముందు ఆయన 11 ఏళ్లకు పైగా స్పైస్‌జెట్‌లో పనిచేశారు. జూన్ 2011 నుంచి జూన్ 2022 వరకు స్పైస్‌జెట్‌లో విధులు నిర్వహించిన ఆయన సీనియర్ కమాండర్‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 2020 నుంచి జూన్ 2022 వరకు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా ఇతర పైలట్లకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించారు.

బోయింగ్ 737 విమానాలను 9,500 గంటలకు పైగా నడిపిన అనుభవం మచ్ఛర్‌కు ఉంది. జూన్ 2022 నుంచి ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్‌గా పనిచేస్తూ దుబాయ్‌లో నివసిస్తున్నారు. అక్కడ కూడా పైలట్ల శిక్షణ, విమాన కార్యకలాపాల నిర్వహణలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమానయాన భద్రతా ప్రమాణాలు, నిబంధనల అమలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే అనుభవం ఆయన కెరీర్‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ 30న జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us