
ముంబై, అక్టోబర్ 6: మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని దొంగలు కొత్త కొత్త మార్గాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలో డెలివరీ ఏజెంట్ వేషంలో వచ్చిన ఓ దుండగుడు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది?
ముంబైలోని కాందివలీ వెస్ట్ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో నవంబర్ 3వ తేదీ రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 9:23 గంటల సమయంలో ఓ వృద్ధురాలు బయటకు వెళ్లి తిరిగి తన ఫ్లాట్‌కు చేరుకున్నారు. ఇంటి తలుపు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో డెలివరీ ఏజెంట్లా దుస్తులు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ముందుగా పక్కింట్లో నివసించే వ్యక్తి గురించి అడుగుతూ ఆమెతో మాటలు కలిపాడు. దీంతో అతడు ఏదో సాధారణ విషయం అడుగుతున్నాడని ఆమె భావించారు. అయితే, కొద్దిసేపటికే ఆ దుండగుడు ఒక్కసారిగా వృద్ధురాలిపై దాడి చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కున్నాడు. అనంతరం అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.
ఈ మొత్తం ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. వీడియోలో నిందితుడు వృద్ధురాలి వద్దకు వచ్చి మాటలు కలపడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె మెడలోని గొలుసును లాక్కొని పారిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దుండగుడి దాడితో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాందివలీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డెలివరీ ఏజెంట్లు, ఇతర సర్వీస్ సిబ్బంది పేరుతో అపరిచితులు నివాస సముదాయాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి లేదా పోలీసులకు సమాచారం అందించాలి.